AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పట్నం నరేందర్‌రెడ్డికి బిగ్‌ షాక్‌.. హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత

కొడంగల్‌ బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డికి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. లగచర్ల దాడి ఘటనలో తనకు రిమాండ్‌ విధించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును పట్నం నరేందర్‌ రెడ్డి ఆశ్రయించారు. అయితే క్వాష్‌ పిటిషన్‌పై బుధవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. నరేందర్‌ రెడ్డి బెయిల్‌ విషయాన్ని పరిశీలించి తీర్పు చెప్పాలని జిల్లా కోర్టును ఆదేశించింది. కాగా, లగచర్ల దాడి ఘటనలో అరస్టయిన నరేందర్‌ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డిని ఏ–1గా గుర్తించిన అధికారులు గత నెల ఆయన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

నరేందర్‌రెడ్డి ప్రధాన కుట్రదారుడు..
అయితే, 10 రోజుల క్రితమే పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం తాజాగా నరేందర్‌ రెడ్డి దాఖలు చేసిన్నక్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. అధికారులపై దాడి కేసులో ఏ1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రధాన కుట్రదారుడని పోలీసులు, ప్రభుత్వం తరఫు న్యాయవాది పల్లె నాగేశ్వర్‌రావు కోర్టుకు తెలిపారు. ఏ2గా ఉన్న భోగమోని సురేష్, ఇతర నిందితులకు ఆర్థికంగా, నైతికంగా సహకరించారని వెల్లడించారు. సురేశ్‌తో దాదాపు 89 సార్లు నరేందర్‌ రెడ్డి ఫోన్లో మాట్లాడారని ధర్మాసనానికి తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే నిందితులు కలెక్టర్‌ సహా ఇతర అధికారులను హత్య చేయాలనే కుట్రతో దాడి చేశారని కోర్టు విన్నవించారు. దాడికి కుట్రలో నరేందర్‌ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని.. అవన్ని దర్యాప్తులో బయడపడతాయని, అప్పటి వరకు కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని కోరారు. తాజాగా, ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం నరేందర్‌ రెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10