తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన వెంటనే ఎన్నో విమర్శలు వినిపించాయి. కానీ రోజురోజుకు హైడ్రాకు మద్దతు పెరుగుతోంది. స్వచ్చందంగా ప్రజలు కూడా హైడ్రాకు అండగా నిలుస్తుండగా.. దటీజ్ సీఎం రేవంత్ అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. కేవలం భాగ్యనగర ప్రజల భాగ్యం కోసమే తాము ప్రయత్నిస్తున్నామని, చెరువులలోని ఆక్రమణలు తొలగిస్తే చాలు.. పర్యావరణాన్ని, ప్రకృతిని రక్షించినట్లుగా భావించాలని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైడ్రా అంటే బూచిగా చూపించడం సరికాదని, భవిష్యత్ లో వరదలు వస్తే, ఆ నీరు ఆక్రమణల్లో నిలిచిపోతే ప్రజల పరిస్థితి ఏమిటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఇలా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని మంత్రులు కూడా పలు వేదికల ద్వారా హైడ్రాపై ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ప్రజలలో మార్పు వచ్చింది. హైడ్రాకు తమ మద్దతు సైతం ప్రకటించారు. చెరువులలో గల అక్రమ కట్టడాలను పలువురు స్వయంగా తొలగించి బాసటగా నిలిచారు. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా, హైదరాబాద్ నగర ప్రజల రక్షణ, సంక్షేమం లక్ష్యంగా తన పని తాను ప్రభుత్వ ఆదేశాల మేరకు చేసుకుంటూ వెళుతున్నారు. హైడ్రా దెబ్బకు ఆక్రమణల పర్వం కాస్త తగ్గినా, ఇంకా అక్కడక్కడ గల ఆక్రమణలను తొలగించే పనిలో హైడ్రా నిమగ్నమైంది.
ఇటీవల అమీన్‌పూర్ సరస్సులో 12 సెంటీమీటర్ల రెడ్ బ్రెస్ట్ ఫ్లైక్యాచర్ పక్షి కనిపించింది. మొన్నటి వరకు ఇటువంటి అరుదైన పక్షులు కనిపించిన జాడ కూడా లేదు. ఇటీవల హైడ్రా అధికారులు, సరస్సు వద్ద ఉన్న ఆక్రమణలను తొలగించి పునరుద్దరించారు. దీనితో ఎన్నో అరుదైన పక్షులకు ఇది ఆవాసంగా మారింది. ఈ పక్షులను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు అమిత ఆసక్తి చూపుతున్నారు. హైడ్రా చేపట్టిన చర్యలతో ప్రకృతి పులకించి పోతుందని, ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని వారు పిలుపునిస్తున్నారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
దీనితో సీఎం రేవంత్ రెడ్డి సైతం ట్వీట్ చేశారు. ప్రకృతిని మనం జాగ్రత్తగా చూసుకుంటే ప్రకృతి మనల్ని ఆదుకుంటుందని తాను ఎప్పుడూ నమ్ముతానన్నారు. గత కొన్ని నెలలుగా మన నీటి వనరులను, పర్యావరణ సంపదను, మన భవిష్యత్తు కోసం రక్షించుకుంటున్నామని ట్వీట్ చేశారు. ప్రకృతిని క్షీణింపజేసి, నాశనం చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ఎన్నో చెరువులను, సరస్సులను ఆక్రమణల చెరనుండి విడిపించామన్నారు సీఎం. హైడ్రా ద్వార పునరుద్ధరించబడిన అమీన్‌పూర్ సరస్సులో కనిపించిన 12 సెంటీమీటర్ల రెడ్ బ్రెస్ట్ ఫ్లైక్యాచర్ పక్షి తాము సరైన మార్గంలో ఉన్నామని చెప్పేందుకు నిదర్శనమని, ఇది భగవంతుని ఆమోదం లాంటిదని సీఎం ట్వీట్ చేశారు.