రంగారెడ్డి జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునేవారి పైకి దూసుకెళ్లిన్న లారీ.. బీద బతుకులను ఛిద్రం చేసింది. ఈ ఘటన చేవెళ్ల మండలం ఆలూర్ గేటు వద్ద జరిగింది. ఈ ఘటనలో రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులు ఆరుగురు చిరువ్యాపారులు మృతి చెందగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటనా స్థలంలో లారీ టైర్ల కిందపడి.. కాళ్లూ చేతులు విరిగి బాధితులు ఆర్తనాదాలతో, కూరగాయలు పండ్లు చెల్లాచెదురుగా పడిపోయి రక్తపు మరకలతో బీతావహ పరిస్థితి నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని.. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులు తరలించారు. ప్రమాద సమయంలో రోడ్డు పక్కన సుమారు 50 మందికి పైగా.. కూరగాయలు, పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. చూస్తుండగానే అతివేగంతో ఓ లారీ వ్యాపారులపైకి దూసుకొచ్చింది. వ్యాపారులను తొక్కుకుంటూ వెళ్లి.. చెట్టును ఢీకొట్టటంతో లారీ ఆగిపోయింది. ఈ క్రమంలో లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా.. స్థానికుల సహాయంలో బయటకు తీశారు. బయటకు తీసిన తర్వాత ఆ డ్రైవర్ పారిపోయారు.
అయితే.. లారీకి బ్రేకులు ఫెయిల్ అయ్యాయా.. లేదా అతివేగంతో రావటం వల్ల కంట్రోల్ చేయలేకపోవటం వల్ల జరిగిందా.. లేదా లారీ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. బ్రేకులు ఫెయిల్ కావటం వల్లే.. ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదంలో.. ఆరుగురు వ్యాపారులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్టు తెలుస్తుండగా.. మరో నలుగురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉనట్టు సమాచారం. మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలిస్తున్నారు.