సంగారెడ్డిలోని అమీన్పూర్లో జోరుగా కూల్చివేతలు
ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా సోమవారం మరిన్ని కూల్చివేతలు చేపట్టింది. హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది. నగర శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. అమీన్ పూర్ వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణంపై కొరడా ఝుళిపించింది. రోడ్డును ఆక్రమించి నిర్మించిన భవనాన్ని కూల్చివేశారు. నోటీస్ ఇచ్చినప్పటికీ ఇళ్లను తొలగించకపోవడంతో హైడ్రా సీరియస్ అయింది. భారీ యంత్రాలతో అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు.
వందనపురి కాలనీలో చర్యలు..
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణంపై కొరడా ఝుళిపించారు. కొంతమంది రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారు. భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు. అమీన్‌పూర్‌లోని వందనపురి కాలనీలో అక్రమ భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.
మరో రెండు చోట్ల ఆక్రమణలు..
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మరో రెండు చోట్ల అక్రమ నిర్మాణాలను గుర్తించారు. ఇటీవల నాగారం మున్సిపాలిటీలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కూల్చివేశారు. ముందుగానే హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చి 15 రోజులు గడువు ఇస్తున్నారు. రెండు వారాల్లో నిర్మాణాలను యజమానులే ఆక్రమణలు తొలగించకపోతే హైడ్రా రంగంలోకి దిగనుంది.
ఇప్పటి వరకు 300కుపైగా అక్రమ నిర్మాణాల కూల్చివేత..
తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయమే హైడ్రా. దీనిని ఏర్పాటు చేసి మూడున్నర నెలలు దాటింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న చాలా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది. రాష్ట్ర చరిత్రలోనే మూడున్నర నెలల వ్యవధిలో 300కు పైగా అక్రమ నిర్మాణాల హైడ్రా నేలమట్టం చేసింది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం జూలై 19వ తేదీన హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 99ను తీసుకువచ్చింది. దీంతో జూలై 26వ తేదీ నుంచి కూల్చివేతలను మొదలుపెట్టింది హైడ్రా. ఇప్పటి వరకు 30కు పైాగా ప్రాంతాల్లో 300కు మించి ఆక్రమణలను కూల్చివేసింది. 100 రోజుల్లో 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగింది. జీహెచ్ఎంసీతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా దూకుడు మామూలుగా లేదు. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో దేశవ్యాప్తంగా హైడ్రా పేరు మార్మోగింది.
వ్యతిరేకత రావడంతో..
అయితే.. హైడ్రా కూల్చివేతలపై ప్రజలు హడెలెత్తిపోయారు. ఎప్పుడు ఎవరి ఇంటిని కూల్చివేస్తారో అని భయాందోళనలో ఉన్నారు. హైడ్రా కూల్చివేతలపై పలు చోట్ల తీవ్రమైన వ్యతిరేకత కూడా వచ్చింది. పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించగా.. హైడ్రా చట్టబద్ధతపై కోర్టు కూడా ప్రశ్నించింది. జీవో 99పై స్టే ఇవ్వాలంటూ అనేక మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ రూపకల్పన చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు.
పూర్తిస్థాయిలో బాధ్యతలు…
ఇటీవల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో హైడ్రాకు అప్పగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే పవర్ హైడ్రాకు ఇచ్చింది. ఈ మేరకు జీవో నెంబర్ 199ను ప్రభుత్వం విడుదల చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖలో 374ఆ ప్రత్యేక సెక్షన్∙చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచింది. ఇక నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు. అక్రమ కట్టడాలకు నోటిసుల జారీ నుంచి కూల్చివేతల వరకు అన్నీ హైడ్రా అమలు చేయనుంది.