AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎవరో ఒక్కరే ఉండాలి.. ‘ఘన్‌పూర్‌’నుంచి తరిమే దాక నిద్రపోను.. ఎమ్మెల్యే కడియంపై రాజయ్య ఫైర్‌

ఇద్దరి మధ్య ముదురుతున్న మాటల యుద్ధం

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్‌ నేత రాజయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోవైపు తెలంగాణలోనే స్టేషన్‌ఘన్‌పూర్‌ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. నియోజకవర్గంలో రాజయ్య, కడియం శ్రీహరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల రాజయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కడియం శ్రీహరి తప్పుబట్టారు. తాజాగా కడియం శ్రీహరి చేసిన విమర్శలపై రాజయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

వారిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోం…
బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై మాజీ మంత్రి తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. స్థాయిని మరిచి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య వార్నింగ్‌ ఇచ్చారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి తాటికొండ రాజయ్య విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌లపై కడియం శ్రీహరి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు.

సవాళ్ల పర్వం..
స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి , రాజయ్యల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. నిన్న కడియం శ్రీహరి చేసిన సవాల్‌ను రాజయ్య స్వీకరించారు. ‘స్టేషన్‌ ఘన్‌పూర్‌లో నువ్వా.. నేనా ఇద్దరిలో ఒక్కరే మిగలాలి. నువ్వు దళిత ద్రోహివి..స్థానికేతరుడివి. నిన్ను స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి తరిమే వరకు నేను నిద్రపోను. కడియం శ్రీహరి అవినీతి చిట్టా మొత్తం బయట పెడతా. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ అల్లుడుని అడ్డం పెట్టుకుని స్టేషన్‌ ఘన్‌ పూర్‌ నియోజకవర్గంలో భూములు కబ్జా చేస్తున్నది నిజం కాదా. నీ భూ కబ్జాలు బయటపెట్టడానికి నేను సిద్ధం. నువ్వు సత్య హరిశ్చంద్రుడివి అయితే నీ బిడ్డను ఎంపీని చేయడానికి రూ.100 కోట్లు ఎలా ఖర్చు పెట్టావు. ఆ డబ్బు ఎక్కడిది’’ అని కడియం శ్రీహరిపై రాజయ్య ప్రశ్నల వర్షం కురిపించారు.

శుద్ధపూసలా మాట్లాడుతున్నావ్‌..
‘‘కడియం శ్రీహరి శుద్ధపూసలా మాట్లాడుతున్నారు. ఆయన రాజకీయ వ్యభిచారిలాగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే పదవితోపాటు డిప్యూటీ స్పీకర్‌ పదవికి సైతం కేసీఆర్‌ రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించారు. పలు సందర్భాల్లో ఎమ్మెల్యే, ఎంపీ పదవులకే కాదు.. కేంద్ర మంత్రి పదవికి సైతం కేసీఆర్‌ రాజీనామా చేశారు. కడియం శ్రీహరి ముందు బెంచి నుంచి వెనుక బెంచిలో కూర్చునే స్థాయికి వచ్చారు.

అలాంటి కడియం శ్రీహరి.. తనకు ఫిరాయింపు చట్టాలపై గౌరవం ఉందని చెప్పడం సిగ్గుచేటుగా ఉంది. 1994లో కడియం శ్రీహరికి ఎమ్మెల్యే అయ్యే నాటికి డొక్కు స్కూటర్‌ మాత్రమే ఉండేది. అలాంటి కడియం శ్రీహరిని ఎన్టీఆర్‌ పిలిచి.. ఎమ్మెల్యే చేసి మంత్రిని చేశారు. సాంఘీక సంక్షేమ శాఖా మంత్రిగా చేసి కడియం కుబేరుడు స్థాయికి చేరారు. మంత్రిగా కడియం శ్రీహరి 8 శాతం కమీషన్‌ తీసుకున్నారు. శ్రీహరి కుమార్తె ఎంపీ కావ్య, అల్లుడు నజీర్‌ హాంకాంగ్, సింగపూర్‌లో సైతం భారీగా ఆస్తులు కొనుగోలు చేశారు. కడియం శ్రీహరికి దళిత దొరగా పేరు పెట్టారు. 1999లో ఒక్కో ఓటుకు కడియం శ్రీహరి రూ. 500 ఇచ్చి నాపై గెలిచారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వేరే పార్టీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాను’’ అని తాటికొండ రాజయ్య గుర్తు చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10