స్వల్ప ఉద్రిక్తత
కలెక్టర్ ఆదేశాలతో అనుమతి
బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే: ఎంపీ
బీజేపీ ఎంపీ డీకే అరుణ లగచర్ల పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. లగచర్ల వెళ్తుండగా పూడూరు మండలం మన్నెగూడ వద్ద పోలీసులు డీకే అరుణను అడ్డుకున్నారు. ఆమె కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకోవడమేంటని పోలీసులపై మండిపడ్డారు. దీంతో అక్కడి నుంచే వికారాబాద్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాలతో డీకే అరుణ ముందుకు వెళ్లేందుకు అనుమతించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకొని లగచర్లలో అధికారులపై దాడి ఘటన గురించి కలెక్టర్ మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పంతానికి పోవద్దని గతంలోనే చెప్పా..
ఫార్మా కారిడార్ ఏర్పాటు విషయంలో పంతానికి పోవద్దని ముఖ్యమంత్రికి తాను గతంలోనే చెప్పానని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఫార్మా బాధితుల విషయమై తాను కలెక్టర్‌తో ముందే మాట్లాడానని చెప్పారు. లగచర్లలో జరిగిన ఘటన దురదృష్టకరమని, అలాంటి దాడులను ఎవరైనా ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. సీఎం సొంతం నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే నిఘా విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి వికారాబాద్‌లో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఫార్మా కంపెనీలు తమకు వద్దని లగచర్ల సహా ఐదు గ్రామాలు ఎప్పట్నించో వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. భూసేకరణకు వ్యతిరేకంగా గతంలోనూ ధర్నాలు చేశారని, ఆయా నిరసనల్లో తాను పాల్గొన్నానన్నారు. లగచర్ల ప్రజలు చేసింది వందశాతం తప్పేనని, అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు బుధవారం తాను లగచర్లలో పర్యటిస్తానని డీకే అరుణ ప్రకటించారు.