కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ పెద్ద సాహసమే చేశారు. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ యువతిని కాపాడారు. ఈ ఘటనలో గాయపడ్డ ఆమెను తన సొంత కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్య సహాయం అందేలా తక్షణ చర్యలు చేపట్టారు. ఫలితంగా ఆ యువతి కోలుకుంటోంది.
ఆమె పేరు దివ్యశ్రీ. ఈ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది. స్కూటీపై వెళ్తోన్న ఆమెను ఓ భారీ లారీ అదుపు తప్పి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆమె ఆ లారీ ముందు చక్రాల కిందికి వెళ్లింది. ఎడమ టైర్ కింద పడింది. ఈ విషయాన్ని గమనించిన వెంటనే లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు.
ఈ ఘటనలో ఆమె తల వెంట్రుకలు చక్రాల్లో చిక్కుకుపోయాయి. దీనితో ఎటూ కదల్లేని స్థితికి చేరుకుంది. స్థానికులు ఆమెను కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో అటుగా వెళ్తోన్న బండి సంజయ్.. దీన్ని గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌ని అక్కడే నిలిపివేశారు. తాను స్వయంగా కారు దిగి లారీ వద్దకు చేరుకున్నారు. టైర్ కిందికి వంగి ఆమె పరిస్థితి చూశారు. జాకీ ద్వారా లారీని పైకి ఎత్తి.. టైర్‌లో చిక్కుకున్న తలవెంట్రుకలను విడదీయాలంటూ లారీ డ్రైవర్, క్లీనర్‌ను ఆదేశించారు. తీవ్ర భయాందోళనలకు గురైన ఆ యువతికి ధైర్యం చెప్పారు. సురక్షితంగా కాపాడుతానంటూ భరోసా ఇచ్చారు.
సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆమెను కాపాడేంత వరకూ అక్కడే ఉన్నారు. సుమారు అరగంట పాటు అక్కడే గడిపారు. ఈ ప్రమాదం వల్ల రోడ్డుకు ఇరు వైపులా వాహనాల రాకపోకలు స్తంభించిపోగా.. వాటిని సైతం బండి సంజయ్ క్లియర్ చేశారు.