తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో జిల్లాలోని కురుమూర్తి స్వామివారిని దర్శించుకోన్నారు. సీఎం మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకోబోతున్నట్టు సమాచారం. ఆయనతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు అదేవిధంగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పర్యటనకు వెళుతున్నారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లాలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
పలు రహదారులను దారిని మళ్ళించారు. దీంతో ప్రయాణికులు గమనించాలని ఇతర మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ఈ పర్యటనలో రూ.110 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధితో పాటూ వలసల జిల్లా పాలమూరును అభివృద్ధి చేస్తానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో పాలమూరు వెనకబడిందని ఆయన అభిప్రాయడ్డారు. ఈ క్రమంలో సొంత జిల్లా అభివృద్ధిపై సీఎం ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఆ దిశగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. జిల్లా వాసులు సైతం అభివృద్ధిపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికే జిల్లా మోడల్ కాబోతుందని ధీమాతో ఉన్నారు.