టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వ్యక్తిగత నికర సంపద 300 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. గతవారం టెస్లా షేర్లు 30 శాతానికి పైగా పుంజుకోవడంతో ఎలన్ మస్క్ సంపద 304 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో 300 బిలియన్ డాలర్లకు పైగా సంపద గల తొలి కుబేరుడిగా మస్క్ నిలిచారని ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ప్రచారం చేయడం ఎలన్ మస్క్‌కు కలిసివచ్చింది. శుక్రవారం ఒక్కరోజే టెస్లా షేర్ 8.19 శాతం పెరిగి 321.22 బిలియన్ డాలర్లకు, ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద 4.71 శాతానికి పెరిగింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఎలన్ మస్క్ గట్టి మద్దతుదారుగా నిలిచారు. పలు ఎన్నికల సభలకు హాజరయ్యారు. అంతర్జాతీయ బిలియనీర్లలో ఎలన్ మస్క్ మొదటి స్థానంలో నిలుస్తున్నారు. తర్వాతీ స్థానాల్లో ఒరాకిల్ అధినేత లారీ ఎల్లిసన్ (230.7 బిలియన్ డాలర్లు), అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ (224.5 బిలియన్ డాలర్లు), మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ (203.8 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ అర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ (165.5 బిలియన్ డాలర్లు) నిలిచారు.