కొద్ది రోజులుగా సెలెంట్ మోడ్ లో ఉన్న హైడ్రా మళ్లీ రంగంలోకి దిగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల సంరక్షణ కోసం హైడ్రాను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కమిషనర్ గా సీనియర్ అధికారి రంగనాథ్ ను నియమించింది. రంగనాథ్ కమిషనర్ గా హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ఆ భూములను కాపాడింది. రియలర్టర్లు ఆక్రమించి కడుతున్న ఇండ్లను నిర్మాణంలోనే హైడ్రా భూస్థాపితం చేసింది.
హైడ్రాను చెరువుల సంరక్షణ కోసం, వాటి భూములు కాపాడటం కోసం తీసుకువచ్చినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు కురిపిస్తున్నాయి. పేదల ఇండ్లను కూలుస్తున్నారని, పట్టా ఉన్నా కూల్చేస్తున్నారని ఆరోపణలు చేశాయి. ఈ క్రమంలో హైడ్రాపై కొంత వ్యతిరేకత సైతం మొదలైంది. దీంతో కొంతకాలం పాటూ ఇతర పనులపై సైతం హైడ్రా ఫోకస్ పెట్టింది. వర్షా కాలం వస్తే రోడ్డుపై నీళ్లు నిలవకుండా ఉండాలంటే ఏం చేయాలి, ట్రాఫిక్ సమస్యలు ఎలా తీర్చాలి అనే అంశాలపై కూడా దృష్టి పెట్టింది. దీంతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు కాస్త గ్యాప్ వచ్చింది. ఇక ఇప్పుడు మళ్లీ హైడ్రా కూల్చివేతలకు నడుం బిగుస్తోంది. అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇంత కాలం ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ల బౌండరీలను ఫిక్స్ చేసే పనిలో హైడ్రా నిమగ్నం అయింది.
ఇక ఇప్పుడు ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు సిద్దం అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో నోటీసులు ఇచ్చేందుకు అనుమతి లభించడంతో అక్రమార్కలకు చర్యలు తప్పవని హెచ్చరిస్తుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని పార్కులు, రోడ్ల స్థలాలు, నాలాలు, ఫుట్ పాత్లు తదితర ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారికి దాదాపు 50 వరకు హైడ్రా అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. వారం కిందట నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో బుధవారం మన్సురాబాద్ లో రోడ్డు ఆక్రమించి చేపట్టిన ఒక రూం ను నేలమట్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో పాటు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిపై సైతం హైడ్రా ఫోకస్ పెట్టింది.