కులగణనపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. కులగణన కోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఛైర్మన్ గా మాజీ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వర రావుని నియమించింది. సహాయకుడిగా ఐఎఫ్ఎస్ అధికారి బి. సైదులును ఎంపిక చేసింది. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన 24 గంటల్లోనే ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి నుంచే ప్రభుత్వం కులగణన చేపట్టనుంది. 1993 బ్యాచ్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు.. 2019లో రిటైర్ అయ్యారు. టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఆయన పని చేశారు.
ఈ నెల 6 నుంచి కులగణన చేపట్టబోతోంది ప్రభుత్వం. పూర్తి స్థాయిలో దానికి సంబంధించి రంగం సిద్ధం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారానికి సంబంధించి ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 1993 బ్యాచ్ కి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావును తెలంగాణ డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది ఏకసభ్య కమిషన్. కులగణనకు సంబంధించిన వ్యవహారంలో డెడికేటెడ్ కమిషన్ చాలా కీలకంగా వ్యవహరించబోతోంది. భవిష్యత్తులో కులగణనకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే, కోర్టు చిక్కులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం సూచనలతో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో రిటైర్ అయిన వెంకటేశ్వరరావు గతంలో టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ గానూ పని చేశారు. మొత్తానికి ఇదొక కీలక నిర్ణయంగా చెప్పొచ్చు. గతంలో సీఐడీ, విపత్తుల నిర్వహణ స్పెషల్ సీఎస్ గానూ భూసాని వెంకటేశ్వరరావు పని చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో రేవంత్ ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది.