మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. డీఎస్పీ మదనం గంగాధర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. ఉద్యోగం ద్వారా కంటే.. రాజకీయంగా సేవ చేసేందుకు మరింత అవకాశం ఉండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పరోక్ష ఎన్నిక ద్వారా చట్టసభకు ఎన్నిక కావాలని పలువురు ప్రముఖులు భావిస్తున్నారు. ఆ జాబితాలో మదనం గంగాధర్ చేరారు. ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు తన డీఎస్పీ ఉద్యోగానికి సైతం ఆయన రాజీనామా చేశారు. ఇక తన ఈ జీవితం ప్రజా సేవకు అంకితమంటున్నారు.
డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగిన మదనం గంగాధర్ స్వస్థలం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్. భిక్షాటనే వృత్తిగా చేసుకునే జీవించే సంచార జాతికి చెందిన వ్యక్తి ఆయన. చిన్ననాటి నుంచి పని చేసుకుంటూనే కష్టపడి చదువుకున్నారు. ఆ క్రమంలో నిజామాబాద్లో జీజీ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు.
22 ఏళ్లకే ఎస్ఐ..
అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ప్రవేశం పొందారు. దీంతో ఆయన జీవితం మలుపు తిరిగింది. అలా 22 ఏళ్ల వయస్సులో తొలి ప్రయత్నంలోనే ఎస్ఐగా మదనం గంగాధర్ సెలెక్టయ్యారు. అలా 1998 బ్యాచ్లో ఎస్ఐగా చేరారు. గంగాధర్ తల్లిదండ్రులకు ఐదురుగు సంతానం. అందులో ఆయన మొదటి సంతానం. దీంతో కుటుంబాన్ని పైకి తీసుకు రావడానికి గంగాధర్ చేసిన ప్రయత్నాలన్నీ సఫలీకృతమయ్యాయి.
నల్గొండ జిల్లాలో ఎస్ఐగా విధులు నిర్వహించారు. అదే సమయంలో.. అంటే.. 2010లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఆయనకు పదోన్నతి లభించింది. అయితే తన 26 ఏళ్ల సర్వీసులో వృత్తిపట్ల నిబద్దతతో పని చేశారు. అలాగే ఎవరి పట్ల నిస్పక్షపాతంగా వ్యవహరించ లేదు. అదే విధంగా ఎవరిని అణిచివేసే ప్రయత్నం చేయలేదు. తమకు జరిగిన అన్యాయంతో పోలీస్ స్టేషన్ మెట్లేక్కిన ఏ ఒక్క బాధితుడికి న్యాయం జరిగేలా చూశారు.