రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూముల వివాదానికి సంబంధించి ఈడీ దర్యాప్తు జరుపుతుండగా, అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలించింది ఈడీ. బుధవారం 7 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. నాగారం భూదాన్ భూములతో పాటు వట్టినాగులపల్లి భూకేటాయింపులు, ధరణిలో రికార్డులు మాయంపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే, బంధనలకు లోబడే పనిచేశానని అమోయ్ కుమార్ ఈడీకి తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో 50 ఎకరాల భూదాన్ భూముల అన్యాక్రాంతం వ్యవహారంలో అప్పటి ఎమ్మార్వో జ్యోతిపై కేసు నమోదైంది. ఈ వివాదంపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. ఇదే వ్యవహారానికి సంబంధించి ఈడీకి కూడా ఫిర్యాదులు అందాయి. దాంతో విజిలెన్స్ విచారణ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఆగమేఘాల మీద భూముల రికార్డులు మారిపోవడంపై గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్ తీరుపై అనుమానాలున్నాయి. మహేశ్వరం మండలం నాగారంలోని భూములపై నడుస్తున్న రెండు కేసుల్లో ఆర్థిక వ్యవహారాలు ముడిపడి ఉన్నాయి. దాంతో ఈడీ రంగంలోకి దిగింది. నాగారంలోని సర్వే నెంబర్ 181, 182లోని 102.2 ఎకరాలపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఇందులో 50 ఎకరాల భూమి తమదేనని భూదాన్ బోర్డు వాదిస్తోంది. అయితే, ఈ భూమి మొత్తం గతంలో జబ్బర్దస్త్ ఖాన్ అనే వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ అయి ఉంది.
తర్వాతి కాలంలో ఆయన కొడుకు హాజీఖాన్ సర్వే నెంబర్ 181లోని 50 ఎకరాల ల్యాండ్‌ను భూదాన్ బోర్డ్‌కి దానం చేశారని బోర్డు చెబుతోంది. ఇదిలా ఉంటే, 2021లో హాజీఖాన్ వారసురాలినంటూ అందులో 40 ఎకరాలు తనదేనని ఖాదరున్నీసా దరఖాస్తు చేసుకున్నారు. ఆఘమేఘాలపై ఆమె పేరు మీదకు భూమి రిజిస్ట్రేషన్ చేసేశారు. రికార్డులను కూడా మార్చేశారు. కింది స్థాయిలో ఆర్డీవో, ఎమ్మార్వో, ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్ అంతా ఆమెకి అనుకూలంగా పనిచేశారు. ఖాదరున్నీసా నుంచి ఈ భూమిని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ కొనుగోలు చేసింది. దాంతో ఎన్నికల సమయంలో ఈ భూముల అన్యాక్రాంతానికి సంబంధించి భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ భూమిపై క్రయవిక్రయాలు జరగకుండా ధరణి పోర్టల్‌లో అధికారులు నిషేధిత జాబితాలో పెట్టారు. ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో అప్పటి ఎమ్మార్వో జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్ట్రార్, ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్స్ యజమాని కొండపల్లి శ్రీధర్‌పై కేసు నమోదు చేశారు. రెండు కేసుల్లో భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఇవి కాక, దాదాపు 98 ఫైల్స్ క్లియర్ చేయడం వెనుక భారీగా డబ్బు చేతులు మారింది. ఈ నేపథ్యంలోనే ఈడీ రంగంలోకి దిగింది. ఇదే వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్‌ను విచారించింది. దాదాపు రూ.500 కోట్ల వ్యవహారాలకు సంబంధించి ఈడీ ఫోకస్ చేసినట్టు సమాచారం. అమోయ్ రంగారెడ్డి పరిధిలో పని చేసినప్పుడు జరిగిన అన్ని దందాలపైనా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.









