పులులు, ఏనుగులు వంటి జంతువులను (Wild Animals) తరలిస్తున్న ఓ ట్రక్కు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అందులోని ప్రాణులన్నీ సురక్షితంగా బయటపడ్డాయి. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.
బీహార్ రాజధాని పట్నా (Patna)లోని సంజయ్‌గాంధీ జాతీయ జూ పార్కు (Sanjay Gandhi Biological Park) నుంచి వివిధ రకాల జంతువుల్ని రెండు వాహనాల్లో బెంగళూరులోని బన్నేర్‌గట్ట జాతీయ పార్కు (Bannerghatta National Park)కు తరలిస్తున్నారు. వీటిల్లో ఎనిమిది మొసళ్లు (Crocodiles), రెండు తెల్ల ఏనుగులు, రెండు తెల్ల పులులు సహా ఇతర జంతువులు ఉన్నాయి. అయితే, నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట గ్రామానికి చేరుకోగానే ఓ ట్రక్కు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి సిమెంట్ స్తంభాన్ని ఢీ కొట్టాడు. దీంతో వాహనం రోడ్డు పక్కకు బోల్తాపడిపోయింది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మొసళ్లలో రెండు బయటపడ్డాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడిపోయిన మొసళ్లను తిరిగి పట్టుకున్నారు. అనంతరం మరో వాహనాన్ని ఏర్పాటుచేసి అన్నింటినీ బెంగళూరు తరలించారు.









