AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్‌ కీలక నిర్ణయం!.. హైడ్రా బాధితులకు పరిహారం.. కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

బిల్డర్ల నుంచి రికవరీ చేసే యోచనలో సర్కార్‌

హైడ్రా కూల్చివేతల బాధితులకు పరిహారం విషయంలో రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఆయా బిల్డర్ల నుంచి డబ్బులు రికవరీ చేసి బాధితులకు ఇప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గత 2–3 నెలల వ్యవధిలో వందలాది ఇళ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. కాగా, ఈ హైడ్రా కూల్చివేతలపై విమర్శలు వస్తున్నాయి. పేదల ఇళ్లను మాత్రమే నేలమట్టం చేస్తున్నారని.. పైసా పైసా కూడబెట్టి కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేయటం సరైంది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. బిల్డర్లు, బడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చేసిన మోసానికి పేదలు నష్టపోతున్నారని.. అసలు అది చెరువుల బఫర్, ఎఫ్‌టీఎల్‌ జోన్‌ అనేది తెలియకుండానే పేదలు.. బిల్డర్ల వద్ద నుంచి ఆ ఇండ్లను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.

బిల్లర్ల నుంచి రికవరీ..
ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బిల్డర్ల మోసానికి బలేపోయే పేదలను ఆదుకోవాలని హైడ్రా సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇళ్లు కోల్పోయిన పేదలకు బిల్డర్ల నుంచి పరిహారం ఇప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించాలని భట్టి సూచించినట్లు సమాచారం. ఈ మేరకు అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై త్వరలో రేవంత్‌ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నష్టపోయిన పేదలకు బిల్డర్ల నుంచే పరిహారం అందించే విధంగా త్వరలోనే విధానపర నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

2 వేలకుపైగా అక్రమ నిర్మాణాలు
గ్రేటర్‌ వ్యాప్తంగా సుమారు 2 వేలకుపైగా నిర్మాణాలు అక్రమంగా నిర్మించారు. ఆయా నిర్మాణాలు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లలో ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. వీటిలో చాలా వాటికి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పంచాయతీలు అనుమతులు సైతం తీసుకున్నారు. ఈ నిర్మాణాలకు అనుమతుల విషయంలో అధికారులు నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. కొందరు బిల్డర్లు ఒక సర్వే నంబరులో అనుమతులు తీసుకొని మరో సర్వే నంబరులో ఇండ్లను నిర్మించారు. ఇవేమీ తెలియని పేదలు బిల్లర్లను గుడ్డిగా నమ్మి ఆయా ఇళ్లను కొనుగోలు చేశారు.

అప్పటి వరకు కూల్చివేతలకు బ్రేక్‌..
ఇప్పుడు ఆ నిర్మాణాలు కూల్చితే.. కొనుగోలు చేసి పేదలు తీవ్రంగా నష్టపోతారని హైడ్రా అధికారులు భావిస్తున్నారు. దాంతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేకతకు దారితీసే అవకాశం ఉందని హైడ్రా ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ అంశంపై సీనియర్‌ మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్‌ నిర్ణయించినట్లు తెలిసింది. ఆయా అక్రమ నిర్మాణాలు పేదలకు అంటగట్టిన బిల్డర్‌ నుంచి కొనుగోలుదారులకు పరిహారం ఇప్పించాలని ప్రభుత్వం యోచిస్తోందట. ఈ ప్రతిపాదనపై స్పష్టత వచ్చే వరకు కూల్చివేతలకు బ్రేక్‌ ఇచ్చినట్లు తెలిసింది.

ANN TOP 10