నవరాత్రులు నేటితో ముగియనున్నాయి. దీంతో జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. దసరా పర్వదినం సందర్భంగా పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తుల క్యూలతో ఆలయ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి.. శనివారం ఉదయం పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమెకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదీకాక.. ఈ రోజు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో వాహన పూజలు నిర్వహించనున్నారు. వాహన పూజ నిర్వహించేందుకు భారీగా యజమానులు తమ వాహనాలను పెద్దమ్మ తల్లి దేవాలయానికి తీసుకు వచ్చారు.
మరోవైపు దేశవ్యాప్తంగా ఈ రోజుతో శరన్నవరాత్రులు ముగియనున్నాయి. అదీకాక నేడు దసరా పర్వదినం కావడం అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయంలో కొలువు తీరిన దుర్గమ్మ వారు.. ఈ రోజు శ్రీరాజరాజేశ్వరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక తిరుమలలోని శ్రీవారి బ్రహ్మోత్సవాలు సైతం ఈ రోజుతో ముగియనున్నాయి.