AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రతన్‌ టాటా వారసులెవరు?.. ఎవరు సారథ్యం వహిస్తారు?

రూ.లక్షల కోట్ల సంపద ఎవరికి దక్కుతుంది?
అందరి మదిలో అదే ప్రశ్న

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా నింగికేగారు. బుధవారం అర్ధరాత్రి తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆయనకు ప్రపంచంలోని దిగ్గజ పారిశ్రామిక, రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అయితే, రతన్‌ టాటా వివాహం చేసుకోలేదు కదా.. మరి ఆయన వారసులు ఎవరు? అని అందరి మదిలో ఓ ప్రశ్న మెదులుతోంది.

వ్యాపారంలో తనదైన ముద్ర
గుండు సూది నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు, సాల్ట్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ వరకు వ్యాపారంలో తనదైన ముద్ర వేసిన బ్రాండ్‌ ఏదైనా ఉందంటే అంది టాటా అనే చెప్పాలి. ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేట్‌ సామ్రాజ్యాల్లో టాటా గ్రూప్‌ ఒకటి. దాదాపు 156 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ జంషెడ్‌ జీ టాటా స్థాపించారు. జేఆర్‌డీ టాటా నుంచి రతన్‌ టాటా వరకు టాటాల నేతృత్వంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం టాటా గ్రూప్‌ మార్కెట్‌ విలువ రూ.34 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. దాదాపు 21 సంవత్సరాల పాటు టాటా గ్రూప్‌నకు నేతృత్వం వహించి ఉన్నత శిఖరాలకు చేర్చిన రతన్‌ టాటా 86 ఏళ్ల వయసులో నింగికేగారు. ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతు అక్టోబర్‌ 9, 2024 అర్ధరాత్రి సమయంలో కన్నుమూశారు.

అందరి మదిలో అదే ప్రశ్న..
అయితే, ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రధానమైన ప్రశ్న ఏంటంటే.. రతన్‌ టాటా వారసులు ఎవరు? ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యాల్లో ఒకటైన టాటా గ్రూప్‌నకు నాయకత్వం ఎవరు వహిస్తారు? టాటా సన్స్‌ చైర్మన్‌ గా ఎన్‌ చంద్రశేఖరన్‌ 2017లో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తు నాయకత్వం టాటా కుటుంబం నుంచి ఎవరు ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే, ఇప్పటికే టాటా కుటుంబానికి చెందిన పలువురు వివిధ గ్రూప్‌ వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రతన్‌ టాటా సవతి సోదరుడు నోయెల్‌ టాటా ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన గ్రూప్‌ వ్యాపారాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు.

భవిష్యత్‌ వారసులుగా..
నోయెల్‌ టాటా ముగ్గురు పిల్లలు సైతం భవిష్యత్‌ వారసుల జాబితాలో ఉన్నారు. వారే మాయా టాటా, నెవిల్లే టాటా, లేహ్‌ టాటా. నోయెల్‌ టాటా చిన్న కూతురు, 34 ఏళ్ల మాయా టాటా ప్రస్తుతం టాటా ఫైనాన్షియల్‌ సంస్థలో విశ్లేషకురాలిగా పని చేస్తున్నారు. ఆపర్చునిటీస్‌ ఫండ్, టాటా డిజిటల్‌లో కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇక స్టార్‌ బజార్‌ హైపర్‌ మార్కెట్‌ ఛైన్‌ బాధ్యతలను 32 ఏళ్ల నెవిల్లే టాటా చూస్తున్నారు. తాజ్‌ హోటల్స్, రిసార్ట్స్‌ అండ్‌ ప్యాలెస్, ఇండియా హోటల్స్‌ వ్యాపారాలను 39 ఏళ్ల లేహ్‌ టాటా పర్యవేక్షిస్తున్నారు. ఈమె స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లోని ఐఈ బిజినెస్‌ స్కూల్‌ నుంచి మార్కెటింగ్‌ మాస్టర్స్‌ డిగ్రీ అందుకున్నారు. లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నప్పటికీ.. రతన్‌ టాటా సంపద సుమారు రూ.3800 కోట్లుగా ఉంటుందని అంచనా. మరి ఈ సంపద ఎవరకి దక్కుతుందనేది వేచి చూడాల్సిందే.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10