తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. నేటి నుంచి మరో రెండురోజులపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. గతనెల తొలి రెండువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడిన సంగతి తెలిసిందే. అయితే, అదే మాసంలో చివరి రెండువారాలు విపరీతమైన ఎండలు కాసాయి… ఇక, అక్టోబర్ నెల మొదలవ్వగానే మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఇక్కడ కురిసిన భారీ వర్షాల నుంచి జనం ఇంకా కోలుకులేదు. ఇప్పడు మళ్లీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఇప్పుడు వరికోత సీజన్ మెుదలయ్యింది. ఈ వర్షాల వల్ల రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారు.
నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి వాయుగుండం కొనసాగుతున్నట్లు ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. వీటి ప్రభావంతో నేడు రాష్ట్రంలోని యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హన్మకొండ, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబాబాద్, వరంగల్,నారాయణపేట, జోగులాంబ గద్వాల, వికారాబాద్,కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు.