AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైకోర్టును ఆశ్రయించిన మూసీ నిర్వాసితులు.. ఇళ్ల ముందు వెలసిన కోర్టు స్టే బోర్డులు..

మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. తమ ఇళ్లను కూల్చివేయద్దంటూ ఫణిగిరి నగర్ బాధితులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. గతంలో ఆక్రమణలకు మార్క్ వేసిన పెయింటింగ్ ను ఇళ్ల యజమానులు తొలగించేస్తున్నారు. తమ ఇళ్లను కూల్చివేయద్దంటూ ఇళ్ల ముందు హైకోర్టు స్టే బోర్డులను ఏర్పాటు చేసుకున్నారు. అటు చైతన్యపురి కొత్తపేటలోనూ మూసీ నిర్వాసితులు వంటా-వార్పు నిర్వహించారు.

మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన సర్వేలో ఇంకా గందరగోళం కొనసాగుతోంది. మూసీ రివర్ బెడ్ ఏరియాకు సంబంధించి ఇళ్లకు మార్కింగ్ వేయగా.. వారంతా కోర్టుకెళ్లి స్టే తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలలో రెవెన్యూ అధికారులకు స్థానికుల నుంచి తీవ్ర నిరసన సెగలు ఎదురవుతున్నాయి. మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఉప్పల్ తహశీల్దార్ పరిధిలో ఇప్పటికే ఇళ్లకు మార్కింగ్ వేశారు అధికారులు. అయితే తమ ఇళ్లను కూల్చకుండా నిర్వాసితులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన 4 రోజులుగా సర్వే చేస్తున్న అధికారులను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

చైతన్యపురికి సంబంధించి న్యూ మారుతీనగర్, గణేశ్ నగర్, వినాయక్ నగర్, ఫణిగిరి నగర్ కు చెందిన మూసీ నిర్వాసితులు హైకోర్టు బాట పడుతున్నారు. కోర్టు నుంచి స్టే తెచ్చుకుని తమ ఇళ్లను అధికారులు కూల్చకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ఇళ్లను కూల్చకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకునేందుకు పిటిషన్లు వేశామంటూ ఫ్లెక్సీలు చాలా చోట్ల వెలిశాయి.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి సుమారు 45 కిలోమీటర్ల మేర సర్వే కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 30శాతం మంది నిర్వాసితులు.. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా… రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి మూసీ రివర్ బెడ్ ఏరియాలో అనేక మంది శాశ్వత నిర్మాణాల్లో ఉన్నారు, లక్షల రూపాయల విలువ చేసే ప్రాపర్టీ కలిగి ఉన్నారు. దాంతో వారంతా తమ ఇళ్లను ఖాళీ చేసే వెళ్లేందుకు ఒప్పుకోవడం లేదు. మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఉప్పల్ తహశీల్దార్ పరిధిలో ఉన్న రివర్ బెడ్ ఏరియాలో నిర్వాసితులను తరలించడం రెవెన్యూ అధికారులకు కొంత తలనొప్పిగా మారింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10