వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి (Telangana CM Relief Fund)కి రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) భారీ విరాళాన్ని అందజేసింది. రూ.20 కోట్ల చెక్కును సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేశారు. శుక్రవారం ఉదయం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి ఎం ఎస్ ప్రసాద్, బోర్డు సభ్యులతో పాటు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రిలయన్స్ గ్రూప్ మెంటార్ పి వి ఎల్ మాధవరావులు జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎంను కలిసి ఆయనకు రూ.20 కోట్ల చెక్కును అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరద సంభవించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం జిల్లా పూర్తిగా నీట మునిగింది. అనేక మంది ఇళ్లను కోల్పోయారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేశ్ బాబు, సాయిధరమ్‌తేజ్, విశ్వక్‌సేన్ సహా పలువురు విరాళాలు అందించారు.