యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో.. భారీ అంచనాల మధ్య వస్తున్న చిత్రం దేవర. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ చిత్రానికి సంబంధించి.. రిలీజ్ అవుతున్న అన్ని భాషల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తున్న చిత్ర యూనిట్.. తెలుగు ప్రేక్షకుల కోసం ఈరోజు (సెప్టెంబర్ 22న) హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. అయితే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నోవాటెల్ హోటల్‌లో నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఆరు గంటలకు ఈవెంట్ ప్రారంభం కావాల్సి ఉండగా.. అది కాస్త మొత్తానికి రద్దయింది.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావాడానికి కారణం.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల ఓవరాక్షనే. పరిమిత సంఖ్యలో అభిమానులతో ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించాలని మూవీ టీం భావించగా.. అందుకు తగ్గట్టుగానే పాసులు కూడా జారీ చేసింది. అయితే.. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందన్న సమాచారం ఫ్యాన్స్‌కు తెలియటంతో.. భారీ సంఖ్యలో నోవాటెల్‌కు చేరుకున్నారు. పాసులు లేని వాళ్లు కూడా ఈవెంట్ వేదిక వద్దకు దూసుకెళ్తుండటంతో.. నోవాటెల్ సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు.. అత్యుత్సాహంతో హోటల్‌లోని అద్దాలు పగలగొట్టారు. పర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో.. నోవాటెల్ దగ్గర గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఇక.. పోలీసులు రంగంలోకి దిగి.. అభిమానులను కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేశారు. అటు బయట, ఇటు లోపల అభిమానులను కంట్రోల్ చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించినా.. ఫ్యాన్స్ ఓవర్ ఎగ్జైట్ మెంట్‌తో వర్కవుట్ కాలేదు. బయట ఉన్న ఫ్యాన్స్ పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో.. లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఇక.. లోపల కూడా పోలీసులే వేదిక పైకి ఎక్కి అనౌన్స్ మెంట్లు చేసి చేసి.. ఆ తర్వాత వార్నింగులు కూడా ఇచ్చారు.