AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కడదాకా కమ్యూనిస్టుగా బతికిన నేత.. ఏచూరి సంస్మరణ సభలో కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌..

సిద్ధాంతం కోసం పనిచేసిన గొప్ప నాయకుడు
(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. సీతారాం ఏచూరి గొప్పదనాన్ని కీర్తించారు. ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలుగా ఏచూరీతో మాబంధం రక్త సంబంధం అని అన్నారు. నమ్మిన సిద్ధాంత కోసం ఆఖరి వరకు పోరాడిన ఏచూరీ జీవితం తమ లాంటి వారికి ఆదర్శం అని పేర్కొన్నారు. ఎప్పుడు కండువా మార్చుతారో తెలియని కాలంలో సీతారాం ఏచూరి జీవితం స్ఫూర్తిదాయకం అన్నారు. ఫిరాయింపుల కాలంలో పదవుల కోసం కాకుండా.. సిద్ధాంతం కోసం పని చేసిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరీ అని కీర్తించారు. తిట్లు, బూతులు చలామణి అవుతోన్న ప్రస్తుత రాజకీయాల్లో ఏచూరీ రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అన్నారు.

హైదరాబాద్‌ బిడ్డ..
అసలుసిసలైన హైదరాబాద్‌ బిడ్డ సీతారాం ఏచూరి అని పేర్కొన్నారు. ఓట్ల రాజకీయంలో వెనుకబడినా.. తాము ప్రజల కోసం పోరాటంలో ముందున్నామని చాటిచెప్పిన గొప్ప నాయకుడు సీతారాం ఏచూరీ అని కేటీఆర్‌ అన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న కుటుంబంలో పుట్టినప్పటకీ.. ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి ఏచూరీ అని.. ఇందిరా గాంధీని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసిన ఏకైక వ్యక్తి అన్నారు. దీన్ని బట్టే సీతారం ఏచూరీ గుండె ధైర్యం ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రశ్నించటమే ప్రజాస్వామ్యం అని నమ్మిన వ్యక్తి ఏచూరి అని కీర్తించారు.

రవీంద్ర భారతిలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ సంస్మరణ సభ జరిగింది. ఈ సంస్మరణ సభకు కేటీఆర్, కోదండరాం, తమ్మినేని వీరభద్రం, బీవీ రాఘవులు, మోహన్‌ కందా, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తదితరులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరికాసేపట్లో ఈ సమావేశానికి హాజరవనుండగా.. కేటీఆర్‌ తన ప్రసంగం ముగిసిన వెంటనే సభ నుంచి తిరుగుపయనం అయ్యారు.

ANN TOP 10