తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర ప్రసాదంగా భావించే లడ్డూ కల్తీ చేయడంపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. ఈ అంశంపై క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయన్నారు. కోట్లాది మంది భక్తులు కొలిచే దేవుడు తిరుమల శ్రీవారు అని పేర్కొన్నారు.
అలాంటి పుణ్యక్షేత్రంలో తయారు చేసే ప్రసాదంలో కల్తీ జరగడం ఆందోళనకరం అని పేర్కొన్నారు. ఈ సమస్య ప్రతి భక్తుడిని బాధపెడుతుందన్నారు. ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి అవసరం ఉందని రాహుల్ గాంధీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు రాహుల్ గాంధీ.