హైదరాబాద్: అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు న్యాయం చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీలో సభ్యులకు భూకేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. సొసైటీ సభ్యులకు భూమిని కేటాయించడం, వారికి ఇళ్ల స్థలాలు అందించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు.
సమాజంలో జర్నలిస్టులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారన్నారు సీఎం రేవంత్. జర్నలిస్టుల కృషిని గుర్తించి వారి జీవన స్థితిగతులను మెరుగుపరిచే దిశగా భూపంపిణీ కార్యక్రమం ఒక అడుగుగా పరిగణించబడుతుందన్నారు. అయితే, కొంతమంది జర్నలిస్టులు రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్టులు హద్దులు దాటి వ్యవహరించకూడదన్నారు.
కొన్ని పత్రికలు చాలా చిల్లర రాతలు రాస్తున్నాయని సీఎం రేవంత్ విమర్శించారు. కొంతమంది జర్నలిస్టులు చీఫ్ మినిష్టర్ ను చీప్ మినిష్టర్ అంటూ కుర్చీకి ఉన్న గౌరవం పోగొడుతున్నారని మండిపడ్డారు. వ్యక్తి నచ్చకపోవచ్చు వ్యవస్థలో గౌరవప్రతమైన పదవికి విలువ ఇవ్వాలన్నారు. ఎదుటివారు విలువలు దాటితే తాము దాటుతామని తేల్చిచెప్పారు. అసలు జర్నలిస్టుల కంటే కొసరు జర్నలిస్టులు ఎక్కువయ్యారన్నారు సీఎం రేవంత్. నిజమైన జర్నలిస్టులను అగౌరవపరిచే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదన్నారు.
ప్రస్తుతం ఎవరు పడివారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని జర్నలిస్టులంటున్నారని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ.. అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. ఢిల్లీలో పనిచేసే జర్నలిస్టులకు కూడా వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. అయితే, జర్నలిస్టులు సమస్యలు సృష్టించవద్దన్నారు. కొంతమంది చిట్‌చాట్‌లను కూడా బద్నాం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. జర్నలిస్టులు అంటే సమాజానికి సేవ చేసే డాక్టర్లు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అనేక చిక్కుముళ్లను పరిష్కరించిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాలకు జర్నలిస్టులకు అనుమతి లేదన్నారు. జర్నలిస్టులు వృత్తిపరమైన గౌరవాన్ని పెంచుకోవాలన్నారు. ఈ వ్యవస్థలపై నమ్మకం పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.