మున్నేరు పరివాహక ప్రాంతానికి అడ్డుగా రిటైనింగ్ వాల్ కట్టిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్ దంసలాపురంలో పర్యటించారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు ఉన్నారు. భారీ వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్ని పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడి నివారణ చర్యలు, పునరావాస కార్యక్రమాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రం ప్రభుత్వం నుంచి వరద విపత్తుల సంస్థ ద్వారా నష్టంపై సమగ్ర విచారణ అందిన వెంటనే కేంద్రం నుంచి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
అక్కడి నుంచి పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాకు వెళ్లారు నేతలు. అక్కడ మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, ప్రధాన మంత్రి మోదీ ఆదేశాల మేరకు పరిశీలనకు వచ్చానని అన్నారు. రాకాసి తండా ప్రజలు వరద కారణంగా సర్వస్వం కోల్పోయారని, పంట పొలాల్లో ఇసుక మేటలు ఉన్నాయని తెలిపారు. గ్రామస్థులు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని కోరారని, అందరి ఆమోదం ప్రకారం రాకాసి తండాను సురక్షిత ప్రాంతానికి మార్చే ఏర్పాటు చేయాలన్నారు. పంట పొలాల్లో ఇసుక మేటలను తొలగించి ఆర్థిక సాయం అందించి రైతులు సాగు చేసుకునే విధంగా చేయాలని చెప్పారు. వరద బాధితులు దైర్యంగా ఉండాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని తెలిపారు. ఇల్లు కోల్పోయిన వారికి వసతి ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వ పరిశీలకులను రప్పించి నష్టం అంచనా వేశామని, బాధితులకు సహాయం అందేలా చర్యలు చేపట్టామని వివరించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ వరద బాధితులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి.