ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సంభవించిన విపత్తు గురించి అందరికీ తెలిసిందే. దాదాపు 5 రోజులు అవుతున్నా.. ఇంకా కొన్ని గ్రామాలు జలమయమై ఉండటం బాధపడాల్సిన విషయం. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు సాధ్యమైనంతగా ఈ విపత్తు నుంచి ప్రజలను బయటపడేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాలకు అండగా ఉండేందుకు పులువురు ముందుకు రావడం ఆహ్వానించదిగిన పరిణామం. టాలీవుడ్‌కు సంబంధించి ఇప్పటికే ఎందరో విరాళాలు ప్రకటించి.. తమ గొప్ప మనసు చాటుకున్నారు. మెగా ఫ్యామిలీ (Mega Family)కి సంబంధించి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు ప్రకటించిన విరాళం దాదాపు రూ. 8.5 కోట్లు. ఇందులో పవన్ కళ్యాణ్ అధికంగా రూ. 6 కోట్లు ప్రకటించారు. ఇప్పుడు తన ఫ్యామిలీ ఇచ్చిన స్ఫూర్తితో మెగా డాటర్ నిహారిక కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 400 పంచాయితీలకు, పంచాయితీకి లక్ష చొప్పున రూ. 4 కోట్లు ప్రకటించినట్లుగా.. నిహారిక కూడా ఇప్పుడు విజయవాడ రూరల్ ఏరియాలో వరద ముంపుకు గురైన ఓ పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి ఏభై వేలు చొప్పున ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు.