ఉప్పొంగి ప్రవహిస్తున్న నాలాలు
సమీప ప్రాంతాల ప్రజల అప్రమత్తం
(అమ్మన్యూస్, హైదరాబాద్):
హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలో అన్ని నాలాలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద పోటెత్తింది. దాదాపు 1000 క్యూసెక్కుల వరద ప్రవాహం ట్యాంక్ బండ్ లోకి వస్తోంది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టం అయిన 513.41 మీటర్లను దాటింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని మూసీనదికి వదులుతున్నారు. దీంతో మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీ చేశారు.
జంట జలాశయాలు సైతం..
జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. మూసీ నదికి వరద పోటెత్తింది. మూసారంబాగ్ బ్రిడ్జిని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. హుస్సేన్ సాగర్‌లోకి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.