ఈ అవార్డు సింగరేణి ఉద్యోగులకు అంకితం.. నా సర్ పాషా
(అమ్మన్యూస్, మణుగూరు):
మణుగూరు ఏరియా సింగరేణి సేవా సమితి సభ్యుడు ప్రముఖ సామాజిక సేవకుడు, కార్మిక నాయకుడు ఎస్డీ నా సర్ పాషాకు జాతీయ అవార్డు వరించింది. బహుజన సాహిత్య అకాడమీ (బీఎస్ఏ) జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన సేవా రత్న నేషనల్ అవార్డు ప్రకటించారు.
ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నాచారంలో జరిగిన కార్యక్రమంలో నల్ల రాధాకృష్ణ ఇతర కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఆహ్వాన పత్రాన్ని నాసర్ పాషాకి ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా నల్లా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకు వెళ్లడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా సంఘ సేవకులకు, రచయితలకు, కవులకు, స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 5న ఏపీలోని తిరుపతిలో నిర్వహించే కార్యక్రమంలో సేవారత్న నేషనల్ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు.
సౌత్ ఇండియాలోని ఆరు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి సుమారు ఆరు వందల మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని రాధాకృష్ణ తెలిపారు. సింగరేణి సేవా సమితి సభ్యుడిగా అనాథ విద్యార్థులకు, చెవిటి మూగ విద్యార్థులకు, వృద్ధాశ్రమలకు, సింగరేణి ఉద్యోగుల సహకారం తో ఆయన చేస్తున్న సేవలకు ఈ గుర్తింపు లభించిందన్నారు.
ఈ సందర్భంగా నా సర్ పాషా మాట్లాడుతూ బీఎస్ఏ సెలక్షన్ కమిటీ కి కృతజ్ఞలు తెలిపారు. నన్ను ఎంతగానో ప్రోత్స హిస్తున్న మణుగూరు ఏరియా సింగరేణి ఉద్యోగులకు ఈ అవార్డు ను అంకిత మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముందు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిబాపూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం ఎం గౌతమ్, రాష్ట్ర కోఆర్డినేటర్ ఏ విష్ణు, అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు పసుల రమేష్, నల్లా జ్యోతి,బి శ్రీనివాస్, నా సర్ పాషా కుటుంబ సభ్యులు జమీలా బేగం,హేర్షద్ బాబు, ఎండి వాహేద్, నల్లా కోవేల తదితరులు పాల్గొన్నారు.