రాజధాని నగరంలో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తున్నది. బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవెల్ భూముల్లో ఉన్న కట్టడాలను వరుసగా కూల్చివేస్తున్నది. ఆక్రమణలను తొలగిస్తున్నది. ఇదే క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ కూడా అక్రమ నిర్మాణమేనని ఇరిగేషన్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడ్చల్ మల్కాజిగిరిలో ఈ అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది. ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు ఆధారంగా హైడ్రా ఈ యూనివర్సిటీని కూల్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. తాము ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, తన భూమిలోనే యూనివర్సిటీని నిర్మించినట్టు వివరించారు.
తనపై ప్రభుత్వం వ్యక్తిగతంగా దాడి చేస్తున్నదని పల్లా ఆరోపించారు. అక్రమ నిర్మాణాలంటూ మెడికల్ కాలేజీని కూల్చే కుట్ర చేస్తున్నారని ఆగ్రహించారు. తమకు నీటిపారుదల శాఖ ఎన్వోసీ ఇచ్చిందని వివరించారు. తన భూమిలో మాత్రమే నిర్మాణాలు చేశామని తెలిపారు. కబ్జా చేసినట్టు నిరూపిస్తే తానే కూల్చేస్తానని పేర్కొన్నారు. తమ మెడికల్ కాలేజీ భవనాలు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని తేలితే ఆ భూమిని వదులుకోవడానికి కూడా తాము సిద్ధమని వివరించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
కాగా, మాజీ మంత్రి హరీశ్ రావు ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతున్నదని, రాజకీయంగా ఎదుర్కోలేకనే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఈ విధంగా దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ మారలేదనే కక్ష్యతోనే ఈ దాడులకు దిగుతున్నట్టు ఆరోపించారు. హైడ్రాను కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.