చొచ్చుకెళ్లేందుకు ఏబీవీపీ యత్నం
తెలంగాణలో సంచలనం రేపుతోన్న టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ఏబీవీపీ ఆందోళనలు చేపడుతోంది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అయితే పోలీసులు ఏబీవీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ తరుణంలో మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ క్వార్టర్స్ లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పేపర్ లీక్‌పై బీజేపీ పోరు కొనసాగిస్తోంది. మంత్రి కేటీఆర్‌ను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తోన్నారు. ఇటీవల పలుమార్లు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఏబీవీపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లారు. నిరసనకారులను పోలీసులు ఈడ్చుకెళ్లి వెహికల్‌లో ఎక్కించారు.
అలాగే టీఎస్‌పీఎస్సీ బోర్డును ఏబీవీపీ కార్యకర్తలు పీకేయడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అంతేకాకుండా పేపర్ లీక్‌పై ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్‌లో టీబీజేపీ ఇటీవల ఒకరోజు దీక్ష చేపట్టింది. నిరుద్యోగులకు న్యాయం చేయాలని, పేపర్ లీక్ వల్ల ఎంతోమంది నిరుద్యోగులు అన్యాయానికి గురవుతున్నారని ఆరోపించింది. నిరుద్యోగులకు న్యాయం చేసేంతవరకు, పేపర్ లీక్ చేసిన నిందితులపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటం చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.