వారి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే ప్రచారం
కేసీఆర్‌ను జైలుకు పంపకుంటే కాంగ్రెస్‌కు గడ్డుపరిస్థితే..
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం మీడియా సృష్టేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ విలీనంపై ఆయన స్పందించారు. ఇప్పటివరకు అలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో మీటింగ్ పెట్టుకున్నారేమో.. బీఆర్‌ఎస్ అంటే బంగ్లాదేశ్ రాష్ట్ర సమితి అని అభివర్ణించారు. బీఆర్‌ఎస్ ఒక ఔట్ డేటెడ్ పార్టీ అని విమర్శించారు. వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అలా మాట్లాడుతున్నారని అన్నారు. వాళ్ళు ఢిల్లీ వచ్చేది కవితను కలిసేందుకు మాత్రమే అని తెలిపారు. బెయిల్ ప్రభుత్వం చేతిలో ఉంటే లా ఎందుకు? కోర్టు ఎందుకు? అని సీరియస్ అయ్యారు. కేసీఆర్‌ను లోపల వేయకుంటే కాంగ్రెస్‌కు గడ్డు కాలం తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. లోపల వేస్తారని ప్రజలు అనుకుంటున్నారు.. ఒక నెల కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఏడాది కావచ్చు.. అలా జరగకుంటే అప్పుడు ఆ రెండు పార్టీలు ఒక్కటే అని అర్థమవుతుందని అన్నారు. వారిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలంటే యూరప్‌కు కాకుండా బంగ్లాదేశ్ పంపాలని ఎద్దేవా చేశారు.
కొందరి ఐఏఎస్, ఐపీఎస్‌లకు తీరని అన్యాయం..
మోదీకి దేశం ముఖ్యం.. దేశ రక్షణ విషయంలో ఆయన కాంప్రమైజ్ కారని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కొంతమంది అధికారులు కొమ్ము కాశారు. నిజాయితీగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ కూడా అదే చేసిందని చెప్పారు. ఆ రెండు పార్టీలకు తేడా లేదని, అవి ఒక్కటేనని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంజుకుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు.