షరతులతో బెయిల్ మంజూరు చేసిన సుప్రీం
(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాకు 17 నెలల తరువాత బిగ్ రిలీఫ్ లభించింది. శుక్రవారం సిసోడియాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం మంజూరు చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాలని సిసోడియాను సుప్రీం ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా సుప్రీం విచారించింది. విచారణ పూర్తయిన అనంతరం కొద్ది రోజుల క్రితం తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం వెలువరించింది. ఈ క్రమంలోనే 17 నెలల తర్వాత మనీష్ సిసోడియా బయటకు వస్తున్నారు.
ఇటీవలే కేజ్రీవాల్‌కు బెయిల్..
కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం విధానం కేసులో బెయిల్ లభించింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సైతం బెయిల్ మంజూరు కావడంతో ఆప్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సిసోడియాకు బెయిల్ సుప్రీం బెయిల్ ఇచ్చింది. ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైలులో ఉంచలేరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు విచారణలో పురోగతి లేకపోతే… ఒక పరిమితి దాటిన తర్వాత జైలులో ఉంచలేరని పేర్కొంది. అలా కాదు అని… జైలులో ఉంచాలి అనుకుంటే ఆ వ్యక్తి హక్కులు హరించడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. బెయిల్‌కి అప్లికేషన్ పెట్టుకోవడం, బెయిల్ పొందడం వారి హక్కు అని ధర్మాసనం పేర్కొంది.









