AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పెళ్లిపీటలపైనే నవదంపతులు గొడవ.. వధువు మృతి, వరుడి పరిస్థితి విషమం

పెళ్లిపీటలపైనే నవదంపతులు ఘర్షణపడి.. వధువు చనిపోగా, వరుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. విషాదకర ఈ ఘటన కర్ణాటకలోని కోలారు జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేజీఎఫ్‌ తాలూకా త్యంబరసనహళ్లి గ్రామానికి చెందిన లిఖితశ్రీ, (19), నవీన్‌ బాబు (27)లకు బుధవారం ఉదయం వివాహమైంది. స్థానిక కళ్యాణ మండపంలో జరిగిన ఈ పెళ్లికి బంధువులు, మిత్రులు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. అతిథులతో ఆనందంగా గడిపిన అనంతరం లిఖిత, ఆమె తల్లిదండ్రులను తీసుకుని వరుడు నవీన్ పక్కనే ఉన్న తన మేనమామ ఇంటికి వెళ్లాడు.

అక్కడ అందరూ కలిసి టీ కాఫీలు తాగుతుండగా వధూవరులు ఇద్దరూ మాట్లాడుకునేందుకు ఒక గదిలోకి వెళ్లారు. కానీ, లోపలికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో ఏమో నూతన దంపతులు ఒకరితో ఒకరు గొడవపడి, చేతికి అందిన వస్తువులతో కొట్టుకున్నారు. గదిలో నుంచి అరుపులు విని నవీన్ మేనకోడలు కిటికీలోంచి చూసేసరికి లిఖితపై నవీన్ కొడవలితో దాడి చేయడం కనిపించింది. వెంటనే ఆమె అలర్ట్ చేయడంతో లిఖిత తల్లిదండ్రులు, బంధువులు కలిసి బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు.

తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరినీ హుటాహుటిన కేజీఎఫ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. లిఖిత శ్రీ అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. నవీన్‌ పరిస్థితి విషమంగా మారడంతో అతడ్ని మెరుగైన వైద్యం కోసం కోలారు ఆసుపత్రికి తరలించారు. అయితే, పెళ్లైన గంటలోనే వారిద్దరూ ఎందుకు దాడి చేసుకున్నారో ఇరుకుటుంబాలకు అర్థంకాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10