వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 123 మంది మృతి చెందినట్లు కేరళ అధికారులు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఇండియన్ ఆర్మీ బృందాలు ప్రాణాలకు తెగించి సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకూ 481 మందిని కాపాడారు. జోరుగా వాన కురుస్తున్నా, వరద ప్రవాహం పోటెత్తినా, చీకటిపడ్డా.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. వయనాడ్ సహా కేరళలోని 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
చుట్టూ పేరుకుపోయిన బురద.. బండరాళ్లు.. భయానక వరద ప్రవాహం. నేలమట్టమైన ఇళ్లు, భవనాలు. వేర్లతో సహా పెకిలించుకొని కొట్టుకొచ్చిన భారీ వృక్షాలు, చెట్ల కొమ్మలు. వరదల్లో కొట్టుకొచ్చి మేటవేసిన కార్లు, బైకులు, వాహనాలు. కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు. రోడ్డు ఎక్కడుందో తెలియదు. మనుషులు ఎక్కడున్నారో తెలియదు. వరద ఝరీ చప్పుళ్ల మధ్య బాధితుల ఆర్తనాదాలు వినిపించవు. మేఘుడి గర్జన. ఆగని వాన. వయనాడ్‌లో సహాయక బృందాలకు ఎదురవుతున్న సవాళ్లివి. ఎటు చూసినా విషాద దృశ్యాలే.

ముందకై గ్రామంలో మెడ లోతు బురదలో చిక్కుకొని బతుకు పోరాటం చేస్తున్న ఓ బాధితుడి దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. చుట్టూ నడుము లోతు మేటవేసిన బురదలో అతడు చిక్కుకుపోయాడు. అతడు తన శక్తినంతా కూడదీసుకొని తన ఉనికి చాటుకునేంత వరకు.. అక్కడ మనిషి ఉన్నట్టే తెలియలేదు. ఒళ్లంతా బురదతో బండరాళ్లలో ఓ బండరాయిలా కలిసిపోయాడు. మెడ నుంచి తల భాగం మాత్రమే పైకి కనిపిస్తోంది. బురదలో తల కూడా మునిగిపోకుండా 5 గంటలు పోరాడాడు.
చివరికి శక్తినంతా కూడదీసుకొని పైకి లేచాడు. అక్కడికి సమీపంలో ఉన్న సహాయక బృందాల కంటబడేలా తన ఉనికిని చాటుకున్నాడు. బురదలో కూరుకుపోయిన అతడిని గమనించిన రెస్క్యూ టీమ్.. సుమారు 2 గంటలు శ్రమించి అతడిని కాపాడింది. తనను కాపాడేందుకు ఎవరైనా వస్తారనే నమ్మకంతో అతడు చేసిన పోరాటం ఫలించింది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి కళ్ల ముందు ఎంత మంది బురదలో కూరుకుపోయి, ఊపిరాడక ప్రాణాలు విడిచారో..!









