రాష్ట్రంలో ‘బాస్ స్కామ్’ లేదా ‘సీఈవో ఇంపర్సొనేషన్ ఫ్రాడ్’ పేరుతో సరికొత్త సైబర్ మోసాలు పెరుగుతున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార యజమానులు, పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) జారీ చేసిన సూచనల ప్రకారం, సైబర్ నేరగాళ్లు ఉన్నతాధికారులు, వ్యాపార యజమానులను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నారని శిఖా గోయల్ తెలిపారు. అత్యవసర పనుల పేరుతో ఈమెయిల్, వాట్సాప్ ద్వారా మాల్‌వేర్ ఉన్న ఫైల్స్ పంపిస్తున్నారని వివరించారు. దేశవ్యాప్తంగా కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఇలాంటి మోసాలకు సంబంధించి 300కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని, ఇది పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందని ఆమె పేర్కొన్నారు.
మోసగాళ్లు ZIP/RAR ఫైల్స్‌ను అత్యవసర డాక్యుమెంట్లుగా పంపిస్తారని, వాటిని ఓపెన్ చేయగానే బాధితుల ఫోన్ లేదా కంప్యూటర్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతుందని ఆమె వివరించారు. దీని ద్వారా వాట్సాప్ వెబ్ సెషన్‌లు, ఇతర సమాచారాన్ని దొంగిలించి, బాధితుల పైఅధికారిలా నటిస్తూ ఉద్యోగులకు, ఆర్థిక వ్యవహారాలు చూసే సిబ్బందికి సందేశాలు పంపుతారు. అత్యవసరంగా డబ్బు బదిలీ చేయాలని లేదా రహస్య సమాచారం ఇవ్వాలని ఒత్తిడి చేస్తారు.
అనుమానాస్పద ఫైల్స్, ‘అత్యవసరంగా స్పందించాలి’ వంటి సందేశాలను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. డబ్బుకు సంబంధించిన అభ్యర్థనలు వస్తే, నేరుగా ఫోన్ చేసి నిర్ధారించుకోవాలి. ఒకవేళ ‘బాస్ స్కామ్’ అని అనుమానం వస్తే, ఆ సందేశానికి స్పందించకుండా, అటాచ్‌మెంట్‌ను తెరవకుండా వెంటనే ఐటీ విభాగానికి సమాచారం ఇచ్చి, ఆధారాలతో ఫిర్యాదు చేయాలని శిఖా గోయల్ కోరారు.








