AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.వేల కోట్ల అవినీతి.. చర్చకు సిద్ధమా? .. సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌

గత ప్రభుత్వ తీరుపై నిప్పులు..
– బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందంటూ వెల్లడి
– గొర్రెల స్కీమ్‌లోనే రూ.700 కోట్లు నొక్కేశారని మండిపాటు
– బతుకమ్మ చీరలు, కేసీఆర్‌ కిట్స్‌ పథకాల్లోనూ అదే సీన్‌..
– బీఆర్‌ఎస్‌ తీరు వల్లే కేంద్ర బడ్జెట్‌లో నిధులు రాలేదని ఆగ్రహం
– అసెంబ్లీలో హాట్‌హాట్‌గా చర్చ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని, ఒక్క గొర్రెల పథకంలోనే రూ.700కోట్లు నొక్కేశారని సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. అలాగే బతుకమ్మ చీరల పంపిణీ, కేసీఆర్‌ కిట్లు ఇలా అన్ని పథకాల్లోనూ భారీ అవినీతి జరిగిందని మండిపడ్డారు. వీటిపై చర్చకు సిద్ధమా? అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు సవాల్‌ విసిరారు. తెలంగాణ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ పద్దుపై శనివారం చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. వేల కోట్లు అవినీతి చేసిందన్నారు. వీటిపై చర్చకు సిద్ధమా? అని సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. బీఆర్‌ఎస్‌ తీరు వల్లే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌ లో నిధులు రాలేదని విమర్శించారు.

‘పాలమూరు’కు తీరని అన్యాయం..
అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి పాలమూరు ప్రస్తావన తీసుకొచ్చారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‌కు ఏం అన్యాయం చేశారని ప్రశ్నించారు. 2009లో కరీంనగర్‌ ప్రజలు ఓడగొడతారని భయపడి పాలమూరుకు కేసీఆర్‌ వలసొస్తే..వలసలు వెళ్లే పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారన్నారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను భుజాల మీద మోసి పార్లమెంట్‌కు పంపించారన్నారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎంగా ఉన్న కేసీఆర్‌.. పాలమూరుకు ఏం చేయలేదని ఆరోపించారు.

గోదావరి జలాలు రాకూడదని కుట్రలు..
రంగారెడ్డి జిల్లా, కొడంగల్‌ ప్రాంతాలకు గోదావరి జలాలు ఇవ్వకూడదని బీఆర్‌ఎస్‌ కుట్రలు చేసిందన్నారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పదేళ్లలో పూర్తి చేయలేదన్నారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్‌ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదన్నారు. కేసీఆర్‌ పాలనలో రంగారెడ్డి జిల్లాలో విలువైన భూములను అమ్ముకున్నారన్నారు. లక్షల కోట్ల విలువైన ఓఆర్‌ఆర్‌ను సైతం అమ్మారన్నారు.

బతుకమ్మ చీరల పంపిణీలోనూ..
తెలంగాణలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. బతుకమ్మ చీరల పంపిణీలోనూ అవినీతి జరిగిందన్నారు. బతుకమ్మ చీరలు అని తెలంగాణ మహిళలను నమ్మించి సూరత్‌ నుంచి కిలోల చొప్పున కొనుగోలు చేసి ఇక్కడి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు గుండు సున్నా ఇచ్చినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు.
అసత్యాలే మాట్లాడుతుండ్రు..
సభను తప్పుదోవ పట్టించినప్పుడు సరిదిద్ధాల్సిన బాధ్యత నాపై ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నామని, కానీ పూర్తిగా సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారన్నారు. విపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు. 2017లో ఆనాటి సీఎం మీటర్లు బిగిస్తామని మోదీతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమన్నారు.

ANN TOP 10