రాష్ట్రంలోని అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డి.వి.అర్ శర్మ ,జనరల్ సెక్రెటరీ ఆనంద్ శర్మలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి అర్చక ఉద్యోగుల సమస్యలు విన్నవించారు.
ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నారు కాబట్టి అర్చకుల బదిలీలు చేయకూడదని ముఖ్యమంత్రి సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ శేషాద్రికి ఆదేశాలు ఇచ్చారు. దేవాదాయ శాఖలో 5 సంవత్సరాలకు పైగా పని చేస్తున్న అర్చక ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, ఒకే శాఖ ఒకే వేతన విధానంలో భాగంగా అర్చక ఉద్యోగులకు ఈఏఎఫ్ ద్వారా వేతనాలు అందించడం, అర్చకులకు, సిబ్బందికి పదవీ విరమణ సమయంలో ప్రస్తుతం రూ. 2 లక్షలు మాత్రమే దేవాదాయ శాఖ చెల్లిస్తుంది. కనీస పెన్షన్ అమలు చేయాలని, దేవాదాయ శాఖ సంబంధించిన భూముల రక్షణకు రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
దేవాలయ సిబ్బందికి ఈవోల ప్రమోషన్స్ త్వరితగతిన చేపట్టాలని కోరారు. అర్చక ఉద్యోగులకు కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి హెల్త్ కార్డులు అందచేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన సందర్భంగా డీవీఆర్ శర్మ, ఆనంద్ శర్మలు సీఎం రేవంత్ రెడ్డికి దైవ ప్రసాదాన్ని, శేషవస్త్రాలు అందచేసి ఆశీర్వదించి, ధన్యవాదాలు తెలిపారు.









