తీవ్ర ఉద్రిక్తత..
పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట
డీఎస్సీ వాయిదా వేయాలంటూ డిమాండ్
(అమ్మన్యూస్, హైదరాబాద్)
నిరుద్యోగులు తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో పోలీసులకు, నిరుద్యోగులకు తోపులాట జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్–1 మెయిన్‌కు 1:100 పద్ధతిలో అభ్యర్థులను పిలవాలనే డిమాండ్లతో నిరుద్యోగులు, ఉద్యోగార్థులు రాష్ట్ర సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. సచివాలయం వద్ద భారీగా పోలీసులును మోహరించారు. బారికేడ్లు, ఇనుపకంచెలు, వాటర్ క్యానన్లను ఏర్పాటు చేశారు. డీఎస్సీని వాయిదా వేయాలంటూ నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రతి ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల, గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సచివాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో సెక్రటేరియేట్ నాలుగు గేట్ల దగ్గర పోలీసులు నిఘా పెట్టారు. మూడు విభాగాల పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బీసీ జనసభ నేత రాజారాం యాదవ్ తో పటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ పరీక్షలను వాయిదా వేయాలని అశోక్ నగర్, దిల్ సుఖ్‌నగర్ ప్రాంతాల్లో నిరుద్యోగుల ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
రూట్ మార్చిన ఆందోళనకారులు..
హైదరాబాద్ సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. డీఎస్సీ వాయిదా కోరుతూ సచివాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు డీఎస్సీ అభ్యర్థులకు పిలుపునిచ్చాయి. కానీ రూటు మార్చిన విద్యార్థి సంఘాల నేతలు, అభ్యర్థులు బీఆర్‌కే భవన్ వైపు వెళ్లారు. దీంతో అక్కడ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు బీఆర్‌కే భవన్‌లో కాళేశ్వరంపై ఐఏఎస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా అభ్యర్థులు దూసుకొచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థి సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరిగింది.