AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా పాలమూరు ముద్దుబిడ్డ.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI నూతన చైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి నియామకమయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ స్టిట్యూషన్స్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబీ), ఎస్‌బీఐ కొత్త చైర్మన్ గా తెలంగాణకు చెందిన వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును సిఫార్సు చేసింది.

చల్లా శ్రీనివాసులు ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉన్నారు. నాలుగున్నరేళ్ల క్రితం, 2020 జనవరిలో ఎస్‌బీఐ ఎండీగా నియమితులయ్యారు. అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్లు, టెక్నాలజీ విభాగాల బాధ్యతలను ఆయన ప్రస్తుతం నిర్వర్తిస్తున్నారు. అయితే, స్టేట్ బ్యాంక్ ప్రస్తుత చైర్మన్ దినేష్ ఖరా వయస్సు 63 సంవత్సరాలు. ఈ ఏడాది ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. బ్యాంక్ కొత్త చైర్మన్ గా చల్లాను నియమించింది.

అయితే.. శ్రీనివాసులు నియామకం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన శ్రీనివాసులు ప్రతిష్టాత్మకమైన ఎస్‌బీఐ చైర్మన్ పదవిని అధిరోహించడం ఒక మహత్తర సందర్భమంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుకు నూతనంగా నియమితులైన చైర్మన్ కు తెలంగాణ రాష్ట్రం తరఫున అభినందనలు తెలియజేశారు. శ్రీనివాసులు తన కొత్త పాత్రలో అనేక విజయాలు ప్రశంసలతోపాటు పదవీకాలం కొనసాగాలంటూ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

చల్లా శ్రీనివాసులు ఎవరు..?
ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న చల్లా.. 36 సంవత్సరాలకు పైగా బ్యాంక్ సర్వీస్ లో ఉన్నారు. 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్ గా ఎస్‌బీఐలోకి అడుగుపెట్టారు. నిజానికి ఆయన బ్యాంకర్ కావాలని అనుకోలేదట. ఐఏఎస్ కావాలన్నది ఆయన టార్గెటంటా. అయితే, తోటి వాళ్లు బ్యాంక్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తుంటే.. చల్లా కూడా పరీక్ష రాసి ఎంపికయ్యారంటా. అలా స్టేట్ బ్యాంక్ ఉద్యోగ పర్వంలోకి ప్రవేశించారు. సమాజానికి సేవ చేసే అవకాశం బ్యాంక్ లోనూ ఉందని గ్రహించి, ఐఏఎస్ కలను వదిలేసి, అందులో స్థిరపడిపోయారు. ప్రొబేషనరీ ఆఫీసర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి, ప్రస్తుతం చైర్మన్ అయ్యారు.

ANN TOP 10