AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్‌.. ఎనిమిది మంది మావోయిస్టులు మృతి

మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులతోపాటు ఓ జవాన్‌ మృతిచెందాడు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణ్‌పూర్‌ జిల్లా అబూజ్‌మడ్‌లో శనివారం చోటు చేసుకుంది. నారాయణ్‌పూర్‌, కొండగావ్‌, కాంకేర్‌, దంతేవాడ డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, ఐటీబీపీ 53వ బెటాలియన్‌, బీఎస్‌ఎఫ్‌ 135వ బెటాలియన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్‌ కొనసాగుతోంది.

ఈ క్రమంలో శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో సాయుధులుగా ఉన్న మావోయిస్టులు తారసపడి జవాన్లపై మెరుపు వేగంతో కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు తేరుకుని ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఇరువర్గాల మధ్య సుమారు రెండు గంటలపాటు కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాసేపటికి జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు. కాల్పుల విరమణ తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎదురు కాల్పుల్లో మృతి చెందిన 8 మంది మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఒక ఇన్‌సాస్‌ రైఫిల్‌, 303 రైఫిల్‌, బీజీఎల్‌ లాంచర్‌తోపాటు ఆయుధ వస్తు సామగ్రిని భారీగా జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కాల్పుల్లో ఒక ఎస్టీఎఫ్‌ జవాన్‌ మృతి చెందగా, మరో ఇద్దరు ఎస్టీఎఫ్‌ జవాన్లు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ANN TOP 10