మరికొంత సమయం కావాలని పోలీసులకు లేఖ
మరోసారి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం
(అమ్మన్యూస్, బెంగళూరు):
తెలుగు రాష్ట్రాలలో సంచలన సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం విచారణకు హాజరుకావాలని టాలీవుడ్ నటి హేమతో పాటు మరో ఎనిమిది మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు వారందరినీ విచారిస్తున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసులో విచారణకు హాజరయ్యేందుకు తనకు మరికొంత సమయం కావాలని క్రైం బ్రాంచ్ పోలీసులకు లేఖ రాసింది నటి హేమ. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు అందులో పేర్కొంది. కానీ, హేమ రాసిన లేఖను సీసీబీ పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని హేమకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక బెంగళూరు రేవ్ పార్టీ కేసులో 86 మందిని విచారించనుండగా.. మొదట 8మందిని విచారణకు పిలిచారు .
ఇదిలా ఉంటే మొత్తం 150 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా 86మంది డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడయింది. ఇందులో 59మంది పురుషులు, 27మంది మహిళలు ఉన్నారు. దీంతో వీరదరికీ విచారణకు హాజరు కావాలని సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొదట ఎనిమిది మంది విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన వారిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారు. అదేవిధంగా బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. అలాగే, వారి బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాసు బ్యాంక్ ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.









