డ్రగ్స్ అనే మాట వినపడకూడదన్న ముఖ్యమంత్రి
సైబర్ సెక్యూరిటీ, నార్కోటింగ్ వింగ్‌లపై సమీక్ష
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినపడకూడదని, డ్రగ్స్ కేసులో ఎవరినీ వదలొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వచ్చారు. ముఖ్యమంత్రికి డీజీపీ రవి గుప్తా, సీఎస్ శాంతికుమారి స్వాగతం పలికారు. సీఎం హోదాలో తొలిసారి ఆయన ఇక్కడకు వచ్చారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సైబర్ సెక్యూరిటీ, నార్కోటింగ్ వింగ్‌లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నార్కోటిక్ డ్రగ్స్ విభాగం పనితీరుపై ఆయన సమీక్షించారు.
డ్రగ్స్ వినియోగంపై సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఆయన.. సినీ తారలు.. సెలబ్రిటీలు.. పెద్ద స్థానాల్లో ఉన్న వారు ఎవరైనా సరే.. వారిని విడిచి పెట్టొద్దని.. డ్రగ్స్ మాట ఎత్తాలంటే భయపడేలా చేయాలని.. వాటి మీద ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు.
లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చి.. పోలింగ్ పూర్తైన పదిరోజుల పాటు పాలన విషయాల మీద పెద్దగా ద్రష్టి పెట్టని సీఎం రేవంత్ ఒక్కసారిగా వేగవంతం అయ్యారు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఆయన పాలన మీద ఫోకస్ పెంచారు. అందుకు తగ్గట్లే ఆయన ఆకస్మికంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వచ్చిన ఆయన.. అక్కడే వివిధ విభాగాలకు చెందిన కీలక అధికారులతో భేటీ అయ్యారు. డ్రగ్స్ వినియోగంపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తీసుకుంటున్న చర్యలు.. పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలతో పోలిస్తే మరింత కఠినంగా వ్యవహరించాలన్న ఆయన.. రాష్ట్రంలో గంజాయి.. ఇతర మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టాలని.. సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు పక్కా ప్రణాళికను రూపొందించాలంటూ తమ సర్కారు ప్రాధాన్యతను స్పష్టంగా చెప్పేశారు.









