ఈ ఎన్నికలు దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికలని కాంగ్రెస్ అధినేత్రి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ అన్నారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకమని ఈ సందర్భంగా ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేటితో ఆరవ దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. మే 25న ఆరో విడత ఎన్నిక పోలింగ్ భాగంగా ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. గురువారం ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి సోనియా గాంధీ వీడియో సందేశంలో ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ.. ‘మీ ప్రతీ ఓటు ఉపాధిని సృష్టిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుంది. మహిళలకు సాధికారతను కల్పిస్తుందని’ అన్నారు. ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలని, లోక్ సభ ఎన్నికలలో ఢిల్లీ ప్రజలు తమ వంతు పాత్ర పోషించాలని కోరారు. మీ ఓటు సమానత్వంతో కూడిన భారతదేశాన్ని సృష్టిస్తుందన్నారు. కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి అభ్యర్థులను భారీ ఓట్లతో గెలిపించాలని, ఇండియా కూటమికి ఓటేయాలని ప్రజల్ని సోనియా గాంధీ సందేశాన్ని పంపారు.
