మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేట్‌లోని ఆయన నివాసం వద్ద ఉదయం నుంచే భారీగా పోలీసులు మోహరించారు.
సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రిని నేడు సందర్శించేందుకు హరీశ్ రావు పిలుపునివ్వడంతో.. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి పనులన్నీ పూర్తయ్యాయని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఎలాంటి పనులు కొత్తగా చేపట్టకుండానే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం రిబ్బన్ కట్ చేసి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఆస్పత్రి వద్ద అసలు పరిస్థితిని ప్రజలకు వివరించడానికే తాము పర్యటనకు పిలుపునిచ్చామని స్పష్టం చేశారు.
మరోవైపు, హరీశ్ రావు అరెస్ట్‌పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ముందస్తు అరెస్టులకు పాల్పడుతోందని నాయకులు మండిపడుతున్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ పలువురు నేతలు హరీశ్ రావు నివాసానికి చేరుకుంటున్నారు.








