AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నంబర్‌ ప్లేట్లు ఏడు రకాలు.. ఒక్కోరంగుకు ఒక్కో ప్రత్యేకత

రోజూ మనం చూసే లక్షలాది వాహనాలకు వెనుకాముందు విభిన్న రకాల నంబర్‌ ప్లేట్లు కనిపిస్తుంటాయి. ఒకదానికి తెలుపు, ఒకదానికి పసుపు.. మరోదానికి ఆకుపచ్చ.. అరుదుగా నలుపు, ఎరుపు, నీలం వర్ణపు ఫలకలు దర్శనమిస్తుంటాయి. ఇలా ప్రత్యేక రంగులో నంబర్‌ ప్లేటు ఏర్పాటు వెనుక కారణాలు మాత్రం చాలామందికి తెలియవు. ఏ రంగు నంబర్‌ ప్లేటు దేనికి సంకేతం? ఎలాంటి సేవలకు దీనిని వినియోగిస్తారు అనేది చాలా కొద్ది మందికే తెలుస్తుంది. కొందరు తెలియక నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలను కిరాయికిచ్చి ఆర్టీఏ అధికారులకు అడ్డంగా బుక్కవుతుంటారు. వాహన రిజిస్ట్రేషన్‌ సమయంలోనే అవి అందించబోయే సేవలకు చిహ్నంగా ఆయా రంగుల్లో నంబర్‌ప్లేట్లను కేటాయిస్తారు. మన దేశంలో ఏడు రకాల నంబర్‌ ప్లేట్లు ఉండగా, ఒక్కో కేటగిరీకి ఒక్కో నంబర్‌ ప్లేట్‌ను ఎలా వినియోగిస్తారో తెలుసుకుందాం..

నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు గుర్తుగా తెలుపు రంగు ప్లేటుపై నలుపు రంగు నంబర్‌ ఉంటే అది నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వెహికిల్‌ అని సూచిస్తుంది.ఇది ఎక్కువ మంది సొంత అవసరాలకు వినియోగించుకునే వాహనాలకు కేటాయిస్తారు. ఇలాంటి నంబర్‌ ప్లేట్‌ ఉన్న వాహనాలను కిరాయికి ఇవ్వడం కుదరదు. ఈ వాహనాలను కిరాయికి నడుపుతూ ఆర్టీఏ అధికారులకు పట్టుబడితే సీజ్‌ చేస్తారు.

పసుపు రంగు.. ట్రాన్స్‌పోర్ట్‌కు సంకేతం
పసుపు రంగు ప్లేట్‌పై నలుపు రంగులో నంబర్‌ ఉంటే అది ట్రాన్స్‌పోర్ట్‌ వాహనమని సంకేతం. ఈ తరహా వాహనాలను కమర్షియల్‌ అవసరాలకు ఉపయోగిస్తారు. గూడ్స్‌ సర్వీస్‌కు అనుమతి ఉన్న వాహనాలని అర్థం.

‘ట్రేడ్‌’కు పసుపు రంగుపై ఎరుపు నంబర్‌
పసుపు రంగు ప్లేట్‌పై ఎరుపు రంగులో నంబర్‌ ఉంటే ఆ వాహనానికి ‘ట్రేడ్‌ సర్టిఫికెట్‌’ ఉందని అర్థం. విక్రయించే కొత్త వాహనాలను తరలించేవాటికి ఇలాంటి నంబర్‌ ప్లేట్స్‌ కేటాయిస్తారు.

ఇలా ఉంటే అద్దెకు..
అద్దె సర్వీస్‌కు అనుమతించిన వాహనాలకు నలుపు రంగు ప్లేట్‌పై పసుపు రంగు నంబర్‌ ఉంటుంది. వీటిని అద్దెకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాహనాలతో చాలా మంది రెంటల్‌ సర్వీస్‌ను అందిస్తున్నారు. ఈ వాహనాలు కాకుండా ఇతర వాహనాలను అద్దెకిస్తే ఆర్టీఏ అధికారులు సీజ్‌ చేస్తారు.

ఎంబసీ వాహనాలకు బ్లూ ప్లేట్‌
విదేశీ రాయబార కార్యాలయాల వాహనాలకు మాత్రమే బ్లూ కలర్‌ నంబర్‌ ప్లేటు ఉంటుంది. విదేశీ ప్రతినిధులు ఈ బ్లూ నంబర్‌ ప్లేట్‌ వాహనాల్లో ప్రయాణిస్తారు. విదేశీ అంబాసిడర్లు, దౌత్యవేత్తల వాహనాలకు ఈ రకం నంబర్‌ ప్లేట్లు ఉంటాయి.

ఈవీలకు ఆకుపచ్చ
దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆకుపచ్చ నంబర్‌ ప్లేట్లు కేటాయించారు. ఎలక్ట్రిక్‌ కార్లు, బైక్‌లకు ఆకుపచ్చ రంగు నంబర్‌ ప్లేట్‌పై తెలు పు రంగులో నంబర్లు ఉంటాయి. ఇక వాణిజ్య ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆకుపచ్చ రంగు ప్లేటుపై పసుపు రంగులో నంబర్లు ఉంటాయి.

గవర్నర్‌, రాష్ట్రపతి వాహనాలకు ఎరుపు
గవర్నర్‌, రాష్ట్రపతి వాహనాలకు ఎరుపు రంగు నంబర్‌ ప్లేట్స్‌ ఉంటాయి. ఈ నంబర్‌ ప్లేట్‌లో జాతీయ చిహ్నం అశోక స్తంభం నమూనా ఉంటాయి. నంబర్లు ఉండవు.

ANN TOP 10