– ప్రభుత్వ విప్ ఆదూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్
– అందరూ దొంగలైతే మల్లారెడ్డి పతివ్రతనా అంటూ వ్యాఖ్యలు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
మల్లారెడ్డి భూములపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్ ఆదూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. అందరూ దొంగలు.. లంగలు అన్న మల్లారెడ్డి పతివ్రతనా..? అంటూ లక్ష్మణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్ మండలం, జీడిమెట్ల గ్రామం సర్వేనెంబర్ 82/1/ఉఉ లో నెలకొన్న వివాదం పై ఆదివారం కొంపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సదరు భూమిని కె సుధామ 2015లో తమతో పాటు మరో ఎనిమిది మంది మూడు వేల 393 గజాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన వారిలో బీఆర్‌ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు సైతం ఉన్నారని అన్నారు. పహాని ప్రకారం రిజిస్టర్ చేసుకున్నామని ఆ భూమిని 2021 లో సేరి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి అందరం కలిసి అమ్మేశామని తెలిపారు. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం యజమాని పొజిషన్ లోకి వెళ్తే దౌర్జన్యం చేయడం దారుణమన్నారు.
తనకు 2 వేల ఎకరాల భూమి ఉన్నదని చెబుతున్న మల్లారెడ్డి ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రిగా పనిచేస్తున్న మల్లారెడ్డి తన భూమిగా చెప్తున్నా స్థలంలో ఎందుకు నిర్మాణ పనులు చేపట్టలేదని అని ప్రశ్నించారు. 2016 లో తమకి కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే దానిని వేకెట్ చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని అన్నారు. సర్వే చేయడానికి నోటీసులు ఇప్పిస్తే ఆ సర్వే తనకు అవసరం లేదని ఆయన వియ్యంకుడు లక్ష్మారెడ్డి చేత సమాధానం పంపించాడని వెల్లడించారు. మల్లారెడ్డి దగ్గర సరైన డాక్యుమెంట్లు ఉంటే.. సర్వే ఎందుకు అవసరం లేదు అని అంటున్నారో.. మల్లారెడ్డి చెప్పాలి అని డిమాండ్ చేశారు.
సుచిత్రలో తాము కొనుగోలు చేసిన ప్లాట్ల వివాద విషయంపై అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లామని ఆయన అందరూ మనవాళ్లే కదా..? ఏదో మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాల్సిందిగా మల్లారెడ్డికి సూచించారని లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. అయితే కేటీఆర్ ముందు సరే అన్న మల్లారెడ్డి, ఆ తర్వాత కేటీఆర్ నాకేమైనా ఫ్రీగా చేశాడా..? నేను మీకు ఏ విధంగా చేస్తాను అంటూ రివర్స్ మాట్లాడారని అని లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. తన స్థలం పక్కన ఉన్న తాము కొనుగోలు చేసిన స్థలాన్ని అప్పనంగా ఆక్రమించుకొని అందులో సినీ ప్లానెట్ కట్టేందుకు మల్లారెడ్డి ప్లాన్ చేశాడన్నారు. అందుకే అప్పటి ఓనర్లైన మమ్మల్ని వేధించాడని అన్నారు. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుపునట్లుగా మల్లారెడ్డి వ్యవహారం కొనసాగుతుందని, ఆయన ఇంకా మంత్రి అనే భ్రమలో ఉన్నారని మండిపడ్డారు.









