న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు భారీ ఊరట లభించింది. ఆయన అరెస్టు చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద ప్రబీర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా.. తక్షణమే విడుదల చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. న్యూస్ క్లిక్ పోర్టల్‌కు విదేశీ నిధులు అందుతున్నాయంటూ ఉగ్రవాద నిరోధక చట్టం కింద గత ఏడాది అక్టోబర్‌లో ప్రబీర్ పురకాయస్థను పోలీసులు అరెస్ట్ చేశారు. చైనా నుంచి నిధులు తీసుకుని ఆ దేశ ఏజెండా గురించి న్యూస్ క్లిక్ సంస్థ అనుకూలంగా కథనాలు ప్రచురించినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆరోపణలు చేసింది. ఈ కేసులో పోలీసులు సరైన ఆధారాలు చూపించడంలో విఫలం కావడం వల్ల ప్రబీర్ పురకాయస్థను వెంటనే విడుదల చేయాలని న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అరెస్టుకు సరైన కారణాలు చెబుతూ రిమాండ్ కాపీని సమర్పించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని పేర్కొంది. ఆ రిమాండ్ కాపీ తమకు అందకపోవడం వల్లే ఈ అరెస్ట్ చెల్లదని, వెంటనే విడుదల చేయాలని ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ష్యూరిటీ, బెయిల్ బాండ్‌ను సమర్పించిన తర్వాత పురకాయస్థను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
