లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వివిధ పార్టీల అభ్యర్థుల భవిష్యత్తు స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉంది. ఈవీఎంలను ఎన్నికల అధికారులు స్ట్రాంగ్‌రూంలకు తరలించగా కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనుండగా, అప్పటి వరకు అభ్యర్థుల గెలుపోటములు ఈవీఎంలలో భద్రంగా ఉండనున్నాయి.
ఎవరి ధీమా వారిదే…
లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో గెలుపోటములపై అభ్యర్థులు ఎవరి ధీమాలో వారు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్న చందంగా పోటీ పడగా, గెలుపోటములపై వారిదైన శైలిలో విశ్వాసంతో ఉన్నారు.
ప్రచారంలో భాగంగా తాము కూడగట్టిన ప్రజల మద్దతు ఆధారంగా అన్ని పార్టీల అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు.
అభ్యర్థుల్లో పెరుగుతున్న టెన్షన్…
పోలింగ్ సరళిపై అంచనా వేస్తూ గెలుపోటములపై అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఒకింత టెన్షన్ వారిలో కనిపిస్తోంది. ఎన్నికల ముందు ఎవరికి వారే ప్రైవేటు సర్వేలు జరిపించిన అభ్యర్థులు, ఎన్నికల తరువాత కూడా పోలింగ్ సరళిపై అంచనాలు రూపొందిస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో వార్డుల వారీగా ఇన్‌చార్జిలతో సమావేశాలు ఏర్పా టు చేస్తూ సమీక్షిస్తున్నారు. అయితే అనుకున్న ప్రకారం ఓట్లు పడ్డాయో…. లేదోననే ఆందోళన ప్రస్తుతం అభ్యర్థుల్లో కనిపిస్తుండగా, జూన్ 4న ఎవరి భవితవ్యం ఏమిటో తేలనుంది.