నంద్యాల పోలీసులపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలో పర్యటించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. తన మిత్రుడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న శిల్పరెడ్డికి మద్దతుగా అక్కడికి చేరుకున్నారు. దీంతో అల్లు అర్జున్‌ను చూసేందుకు వేలాదిగా జనం తరలివచ్చారు. తమ అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేశారంటూ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిలపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్‌డీపీవో రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా చర్యలు తీసుకోవాలి, వారిపై శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.









