తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రాకతో దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాలు ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా లైన్లలో వేచివున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో యాదాద్రి ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పడుతోండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. లడ్డు ప్రసాదం కౌంటర్లు, కల్యాణ కట్ట వద్ద కూడా భక్తుల కోలాహలం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.









